శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By PNR
Last Updated : ఆదివారం, 26 అక్టోబరు 2014 (11:21 IST)

మీడియాపై ప్రశంసల వర్షం : కెమెరా తీసుకుని ఫోటోలు తీసిన మోడీ!

ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారి నరేంద్ర మోడీ దేశ మీడియాతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన జర్నలిస్టులపై ప్రశంసల వర్షం కురిపించారు. బీజేపీ జాతీయ కార్యాలయంలోని ప్రెస్‌ హాలులో వారికి తేనీటి విందు ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మీడియా జర్నలిస్టులతో కలిసిపోయి.. కలివిడిగా తిరుగుతూ... వారి భుజాలపై చేయివేసి... వారి కెమెరాలు తీసుకుని ఫోటోలు తీస్తూ.. ఎన్నడూ లేని విధంగా మోడీ నడుచుకున్నారు. దీంతో బీజేపీ కార్యాలయంలో ఒక్కసారిగా పండగ వాతావరణం నెలకొంది. జర్నలిస్టులు ఉబ్బితబ్బిబ్బులైపోయారు. 
 
ఈ సందర్భంగా మోడీ వారినుద్దేశించి మాట్లాడుతూ ‘మీడియాతో నేరుగా మాట్లాడటానికే నేను ప్రాధాన్యం ఇస్తాను. దానికి అవసరమైన సమయం, సందర్భం కోసం ఎదురు చూస్తుంటాను. అది వచ్చినప్పుడు తప్పక అందుబాటులోకి వస్తాను’ అని చెప్పారు. అంతేకాకుండా, ‘స్వచ్ఛ భారత్‌’ కోసం మీడియా అందించిన సహకారం మరువలేనిదని శ్లాఘించారు. ‘పాత్రికేయులు తమ కలాలను చీపుర్లుగా మార్చారు. ఇది దేశానికి మీరు చేస్తున్న సేవ’ అని కొనియాడారు. ఇందుకుగాను మీడియాకు తానెంతో రుణపడి ఉన్నట్టు చెప్పారు. 
 
‘ఒకనాడు అంతా ప్రభుత్వమే చేయాలని అనుకునేవారు. ఇప్పుడు ప్రతి ఒక్కరూ చేయాలని చెబుతున్నారు. ఇదే స్వచ్ఛ భారత్‌ సాధించిన విజయానికి నిదర్శనం’ అని చెప్పుకొచ్చారు. స్వచ్ఛ భారత్‌ను ప్రభుత్వ కార్యక్రమంగా కాదు.. జాతీయ కార్యక్రమంగా పరిగణించాల్సి ఉన్నదని పేర్కొన్నారు. పలు పత్రికలు, ఎలక్ట్రానిక్‌ మీడియాకు చెందిన సంపాదకులుసహా దాదాపు 400 మంది విలేకరులు మీడియా సమావేశంలో పాల్గొన్నారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా, కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్‌ సింగ్‌, అరుణ్‌జైట్లీ, సుష్మా స్వరాజ్‌, ప్రకాశ్‌ జవదేకర్‌ కార్యాలయంలో మోడీకి స్వాగతం పలికారు.