గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 12 ఫిబ్రవరి 2016 (18:27 IST)

విద్యార్థుల జీవితాలు ఉపాధ్యాయుల చేతుల్లోనే : నరేంద్ర మోడీ

విద్యార్థుల జీవితాలు ఉపాధ్యాయుల చేతుల్లోనే ఉన్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. అందువల్ల విద్యార్థుల జీవితాలను మార్చగలిగే, వెలుగు నింపగలిగే శక్తి ఉపాధ్యాయులకే ఉందన్నారు. 
 
శుక్రవారం ఢిల్లీలోని విజ్ఞాన్‌భవన్‌లో అఖిల భారతీయ ప్రచార్య సమ్మేళన్‌ను ఆయన ప్రారంభించారు. ఇందులో 1100 మందికిపైగా ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోడీ మాట్లాడుతూ... ఉపాధ్యాయులతో ఎందరో జీవితాలు ముడిపడి ఉన్నాయన్నారు. 
 
అన్ని రాష్ట్రాల్లో విద్యాభారతి పాఠశాలలు అగ్రస్థానంలో ఉండాలని మోడీ ఆకాంక్షించారు. పాఠశాలల్లో పరిశుభ్రతే ప్రాధాన్యాంశం కావాలన్నారు. శాస్త్ర సాంకేతికతకు దూరమైతే అభివృద్ధికి ఆటంకం ఏర్పడుతుందని... వీలైనంతమేర సాంకేతికతను ఉపయోగించుకోవాలని సూచించారు.
 
ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో నడిచే విద్యా భారతి పాఠశాలలు నిస్వార్ధ సేవలకు నిదర్శనమన్నారు. అన్ని విద్యాలయాల్లో ఏం జరుగుతుందో ప్రధానాచార్యులు గుర్తించాలని ఆయన సూచించారు. విద్యార్థి జీవితాన్ని మార్చగలిగే శక్తి ఉపాధ్యాయులకే ఉందని, పిల్లల్ని బాగా చదివించటమే తల్లిదండ్రుల కల అని అన్నారు.