గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By PNR
Last Updated : శుక్రవారం, 1 ఆగస్టు 2014 (13:40 IST)

శ్రీలంకకు శాంతి బలగాలు తరలింపు.. రాజీవ్ సొంత నిర్ణయం : నట్వర్!

ఎల్టీటీఈ తీవ్రవాదులను అణిచివేసేందుకు శ్రీలంకకు భారత శాంతి బలగాలను పంపాలని నాటి ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ తీసుకున్న సొంత నిర్ణయమని, ఈ విషయంపై కేంద్ర మంత్రివర్గంలో మాటమాత్రం కూడా చర్చించలేదని కాంగ్రెస్ బహిష్కృత సీనియర్ నేత నట్వర్ సింగ్ ఆరోపించారు. 
 
‘వన్‌ లైఫ్‌ ఈజ్‌ నాట్‌ ఎనఫ్‌' పేరిట పుస్తకంలో ఆయన ఈ బాంబు పేల్చారు. 1987లో కొలంబోలో నాటి శ్రీలంక అధ్యక్షుడు జయవర్ధనే ఇచ్చిన విందుకు రాజీవ్‌ హాజరయ్యారని, తనకు వ్యతిరేకంగా కుట్ర జరుగుతోందని, సైన్యాన్ని పంపించాలని జయవర్ధనే కోరారని, ఇందుకు రాజీవ్‌ వెంటనే అంగీకరించారని, అధికారులు, మంత్రివర్గ సహచరుల సూచనలు, ఆమోదం తీసుకోకుండానే రాజీవ్‌ ఆదేశాలిచ్చారని నట్వర్‌ చెప్పారు. 
 
అప్పట్లో తాను, పీవీ శ్రీలంకలోనే ఉన్నామని గుర్తు చేశారు. ఈ విషయం తమకు తెలిసేటప్పటికే శ్రీలంకకు భారత సైన్యాన్ని పంపాల్సిందిగా ఆదేశాలు జారీ అయ్యాయని చెప్పారు. నాడు తమిళ టైగర్ల ఆధీనంలోని జాఫ్నాలో విమానాల్లోంచి ఆహార పొట్లాలు జారవిడవడంపైనా రాజీవ్‌ ఆషామాషీగా నిర్ణయం తీసుకున్నారన్నారు. శ్రీలంక ప్రభుత్వంతో పాటు ఐరాసలోని మన రాయబారికి సమాచారం ఇచ్చిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు.