గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By PNR
Last Updated : శుక్రవారం, 1 ఆగస్టు 2014 (10:34 IST)

సోనియా లక్ష్యంగా చేసుకుని పుస్తకం రాయలేదు : నట్వర్ సింగ్

తాను రచించిన పుస్తకం కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీని లక్ష్యంగా చేసుకుని రాసింది కాదని కాంగ్రెస్ సీనియర్ మాజీ నేత నట్వర్‌సింగ్ వెల్లడించారు. నట్వర్‌సింగ్ ఆత్మకథ ఒన్ లైఫ్ ఈజ్ నాట్ ఎనఫ్ పుస్తకం శుక్రవారం విడుదల కానుంది. పుస్తకంలో గాంధీ కుటుంబం ఆంతరంగిక విషయాలు వెల్లడించారు. దీంతో నట్వర్‌సింగ్ పుస్తకం సంచలనాలకు కేంద్రబిందువైంది.
 
ఈ పుస్తకావిష్కరణపై ఆయన ఆయన ఓ మీడియాతో మాట్లాడుతూ తాను సోనియా లక్ష్యంగా పుస్తకం రాయలేదన్నారు. నా పుస్తకంలో అన్ని విషయాలను ప్రస్తావించా. పెద్దవాళ్లకు దక్కే గౌరవం నాకు దక్కలేదు. 2011 ఆఖరులో పుస్తకం రాయడం మొదలుపెట్టా. పుస్తకం రాయడం పూర్తయ్యేవరకూ ఏ విషయాన్ని బయట పెట్టలేదు. 
 
కాంగ్రెస్ ఓటమికి కారణం ఎవరూ? దేశవ్యాప్తంగా కాంగ్రెస్ తరపున ప్రచారం చేసినవారు బాధ్యులు కాదా? ఎమర్జెన్సీ తర్వాత కూడా ఇందిరకు 181 సీట్లు వచ్చాయి. గడిచిన సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ దుస్థితికి సోనియా, రాహుల్ బాధ్యులుకాదా? అని ప్రశ్నించారు. గత యూపీఏ హయాంలో ఇరుగుపొరుగు దేశాలతో సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయని పేర్కొన్నారు. వీటిని చక్కదిద్దాల్సిన బాధ్యత ప్రస్తుత ఎన్డీయే ప్రభుత్వంపై ఉందని ఆయన చెప్పుకొచ్చారు.