శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By PNR
Last Updated : గురువారం, 20 నవంబరు 2014 (10:39 IST)

మహారాష్ట్రలో బీజీపీకి ఎన్సీపీ మద్దతెలా ఇస్తుంది : పవార్ కుమార్తె సుప్రియా!

మహారాష్ట్రలో ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ నేతృత్వంలో కొలువుదీరిన బీజేపీ ప్రభుత్వానికి ఎన్.సి.పి. మద్దతు ఎలా ఇస్తుందని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కుమార్తె, ఎంపీ సుప్రియా సూలే ప్రశ్నిచారు. ఫడ్నవిస్ ప్రభుత్వానికి బేషరతు మద్దతు ప్రకటించి, పార్టీ పొరపాటు చేసిందని సుప్రియ బుధవారం వ్యాఖ్యానించారు. 
 
నిజానికి ఎన్నికల ఫలితాలు వెలువడిన మరుక్షణమే బీజేపీ ప్రభుత్వానికి బేషరతు మద్దతును ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ప్రకటించారు. ఈ నిర్ణయం సరి కాదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే ఈ విషయంలో పార్టీ నేతల నుంచి నిరసన ఎదుర్కొంటున్న శరద్ పవార్‌కు బుధవారం తన సొంత కూతురు, పార్టీ ఎంపీ సుప్రియా సూలే నుంచి కూడా నిరసన వ్యక్తమైంది. ఈ నిర్ణయం, మైనారిటీలను పార్టీకి దూరం చేస్తుందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. 
 
కాగా, రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ అనిశ్చితి నేపథ్యంలో ఎన్నికలకు సిద్ధం కావాలని మంగళవారం ప్రకటించిన శరద్ పవార్, మరునాడే యూటర్న్ తీసుకున్నారు. ఫడ్నవీస్ సర్కారును కూలనివ్వబోమని, రాష్ట్ర ప్రయోజనాలను కాపాడతామని ప్రకటించారు. దీంతో పవార్ వ్యాఖ్యలపై పార్టీ నేతల నుంచి నిరసన వ్యక్తమవుతోంది.