గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By PNR
Last Updated : బుధవారం, 20 ఆగస్టు 2014 (17:57 IST)

కాంగ్రెస్‌ను కాపాడాలంటే మహిళా సునామీ తప్పదు : రాహుల్

ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ఎదుర్కొంటున్న గడ్డు పరిస్థితుల నుంచి పార్టీని గట్టెక్కించాలంటే మహిళా సునామీ (ప్రియాంకా గాంధీనా?)రావాలని ఆ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. తన తండ్రి దివంగత రాజీవ్ గాంధీ 69వ జయంతిని పురస్కరించుకుని ఢిల్లీలో ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. 
    
ఇప్పుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ మనుగడ సాగించాలంటే మహిళా సునామీ రావాల్సిందేనని అన్నారు. మహిళా సునామీ అంటే కాంగ్రెస్ పార్టీకి మహిళల మద్దతు కావాలని అన్నారో లేక, ఒక సునామీ వంటి మహిళా శక్తి ప్రియాంక రంగంలోకి రావాలని అన్నారో రాహుల్‌ గాంధీకే తెలియాలని రాజకీయ పండితులు సెటైర్లు వేస్తున్నారు. 
 
ఇకపోతే.. తమ పార్టీ మహిళా రిజర్వేషన్ బిల్లుకు మద్దతు ఇస్తుందని ఆయన ప్రకటించారు. త్వరలో మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగనుండటంతో మహిళా బిల్లును తెరపైకి తీసుకొచ్చారు. యూపీఏ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతి ఒక్క పథకం సామాన్యుడికి మేలు చేసిందని ఆయన అన్నారు. 
 
మన దేశంలో దేవతలను ఆరాధిస్తామని.. కానీ ఆలయాల్లో దేవతలను ఆరాధించేవాళ్లలో చాలామంది బయట బస్సుల్లోనూ, రోడ్ల మీద మహిళలను వేధిస్తున్నారని రాహుల్ గాంధీ గుర్తు చేశారు. దేశంలోని ప్రతి మహిళా ఏదో ఒక సందర్భంలో వేధింపులకు గురైనవారేనని రాహుల్ ఆవేదన వ్యక్తం చేశారు.