శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By PNR
Last Updated : సోమవారం, 20 ఏప్రియల్ 2015 (14:40 IST)

భారత్‌లో నియంతృత్వ పాలన ఉండాలని నేతాజీ కోరుకున్నారా?

ప్రపంచంలో అభివృద్ధి చెందిన దేశాలతో భారత్ పోటీ పడాలంటే కనీసం 20 యేళ్ల పాటు నియంతృత్వ పాలన ఉండాలని నేతాజీ సుభాష్ చంద్రబోస్ కోరుకున్నారా? అవుననే సమాధానం చెపుతోంది ఆయన రచించిన ఓ పుస్తకం. భారత్‌కు స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత అభివృద్ధి చెందిన దేశాలతో పోటీ పడేలా ముందుకు సాగాలంటే ఈ తరహా పాలన తప్పదని నేతాజీ పుస్తకంలో స్పష్టంగా పేర్కొన్నారు. ఈ పుస్తక ప్రతులు తాజాగా బయటపడటంతో ఈ విషయం వెల్లడైంది. 
 
1935లో లండన్‌లో నేతాజీ రాసిన పుస్తకం 'ఇండియన్ స్ట్రగుల్' ప్రచురితం కాగా, అందులో తన భావాలను ఆయన స్పష్టంగా తెలియజేశారు. నియంతృత్వం, కమ్యూనిజంతో కూడిన ప్రభుత్వం పాలిస్తేనే భారత్ దారిలో పడుతుందని ఆయన ఆ పుస్తకంలో రాశారు. దీన్ని ఆయన సామ్యవాదంగా అభివర్ణించారు. 
 
ఇదే యేడాది రోమ్‌కు వెళ్లిన నేతాజీ ఆనాటి ఇటలీ నియంత ముస్సోలినీని కలిసి తన పుస్తకాన్ని బహుమతిగా ఇచ్చారు. గత కొంతకాలంగా నేతాజీ గురించి పలు సందేహాలు వస్తుండటం, ఆయన అదృశ్యంపై నెలకొన్న సందేహాలు, ప్రభుత్వ అధీనంలోని పలు పత్రాల సమాచారం తదితర అంశాలపై నరేంద్ర మోడీ సర్కారు ప్రత్యేక కమిటీని నియమించిన సంగతి తెలిసిందే.