గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 8 డిశెంబరు 2020 (21:33 IST)

భూలోకంలో 'ఇంద్రభవనం' - కొత్త పార్లమెంట్ భవనానికి ఎన్నెన్ని సొబగులో...(video)

దేశ రాజధాని హస్తినలో కొత్త పార్లమెంట్ భవనం నిర్మితంకానుంది. ఇందుకోసం ఈ నెల 10వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ భూమిపూజ చేయనున్నారు. ప్రస్తుతం ఉన్న పాత పార్లమెంట్ భవనం నిర్మించి 93 యేళ్లు అయింది. పైగా, ప్రస్తుత అవసరాలకు అది సరిపోవడం లేదు. దీంతో కొత్త భవనాన్ని నిర్మించేందుకు కేంద్రం పూనుకుంది. 
 
అదేసమయంలో వచ్చే 2022 నాటికి దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 యేళ్లుకానుంది. ఈ డైమండ్ జూబ్లీ వేడుకల నాటికి కొత్త పార్లమెంట్ భవనం సిద్ధంకానుంది. కొత్త భవన నిర్మాణం పూర్తయితే, పాత భవనాన్ని పురావస్తు సంపదగా భావిస్తారు. అయితే, ఈ భవనాన్ని భూలోకంలో ఓ ఇంద్రభవనంలా నిర్మించనున్నారు. ఈ కొత్త భవనం వింతలు, విశేషాలను ఓసారి పరిశీలిద్ధాం. 
 
* ఈ కొత్త భవనాన్ని టాటా ప్రాజెక్ట్స్ లిమిటెడ్ నిర్మించనుంది. 
* ఈ భవనాన్ని త్రిభుజాకారంలో నిర్మించనున్నారు. దీన్ని హెచ్‌సీపీ డిజైన్, ప్లానింగ్ అండ్ మేనేజ్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ రూపకల్పన చేసింది.
* కొత్త పార్లమెంట్ భవనం వచ్చే 2022 నాటికి పూర్తి చేయాలని సంకల్పించారు. 
* ఇందుకోసం రూ.971 కోట్లు ఖర్చు అవుతుందని ప్రాథమిక అంచనా. 
* కొత్త భవనానికి ఆరు ప్రవేశ మార్గాలు ఉంటాయి. 
* వీటిలో మొదటి మార్గం రాష్ట్రపతి, ప్రధానమంత్రి కోసం వినియోగిస్తారు. రెండో మార్గాన్ని లోక్‌సభ సభాపతి, రాజ్యసభ ఛైర్‌పర్సన్, ఎంపీలు, మూడో మార్గాన్ని సాధారణ ప్రవేశ మార్గంగా ఉపయోగిస్తారు. 
* నాలుగో మార్గాన్ని ఎంపీల కోసం, ఐదు, ఆరు మార్గాలను ప్రజల కోసం వినియోగిస్తారు. 
* ఈ భవనాన్ని నాలుగు అంతస్తుల్లో నిర్మించనున్నారు. 
* ఇందులో లోయర్ గ్రౌండ్, అప్పర్ గ్రౌండ్, మొదటి, రెండో అంతస్థులు ఉంటాయి. మొత్తం విస్తీర్ణం 64,500 చదరపు మీటర్లు. 
* లోక్‌సభ ఛాంబర్‌లో 888 సీట్లు ఉంటాయి. దీని మొత్తం వైశాల్యం 3,015 చదరపు మీటర్లు. 
* రాజ్యసభ చాంబర్లో 384 సీట్లు ఉంటాయి. దీని వైశాల్యం 3,220 చదరపు మీటర్లు.
* భూకంపాలను తట్టుకునే విధంగా ఈ నూతన భవనాన్ని నిర్మిస్తారు. 
* ఈ కొత్త భవనంలో 120 కార్యాలయాలను ఏర్పాటు చేసేందుకు అవకాశం ఉంటుంది. 
* అలాగే, కమిటీ సమావేశ మందిరాలు, పార్లమెంటరీ వ్యవహారాల ప్రధాన కార్యాలయాలు, లోక్‌సభ సచివాలయం, రాజ్యసభ సచివాలయం, ప్రధాన మంత్రి కార్యాలయం, కొందరు ఎంపీల కార్యాలయాలు, సిబ్బంది, భద్రతా సిబ్బంది కోసం ప్రత్యేక గదులు వంటివి ఉంటాయి. 
* ఫర్నిచర్‌లోనే స్మార్ట్ డిస్‌ప్లేస్ సదుపాయాలు ఉంటాయి. 
* ఒక భాష నుంచి మరొక భాషకు అనువదిండానికి డిజిటల్ సదుపాయాలు ఉంటాయి. 
* ప్రోగ్రామబుల్ మైక్రోపోన్స్, రికార్డింగ్ సదుపాయాలు ఉంటాయి. సులువుగా ఓటు వేయడానికి వీలుగా బయోమెట్రిక్స్ ఉంటాయి. 
* మరో ముఖ్యమైన విశేషం ఏమిటంటే, దేశీయ వాస్తు రీతుల్లో దీనిని నిర్మిస్తారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో ప్రసిద్ధి చెందిన వాస్తు రీతులు దీనిలో చూడవచ్చు. 
* ఈ భవన నిర్మాణంలో దేశ సాంస్కృతిక వైవిద్ధ్యం కూడా కనిపిస్తుంది. దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన 200 మందికి పైగా కళాకారులు ఈ నిర్మాణంలో పాలుపంచుకుంటారు.