మంగళవారం, 16 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : గురువారం, 9 ఫిబ్రవరి 2017 (08:55 IST)

శశికళ గుట్టు బయటపెడతా... 10 శాతమే వెల్లడించా.. ఇంకా 90 శాతం ఉన్నాయ్ : పన్నీర్ సెల్వం

అన్నాడీఎంకే ప్రధానకార్యదర్శి శశికళ గుట్టును బహిర్గతం చేస్తానని తమిళనాడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం ప్రటించారు. ఇప్పటివరకు కేవలం 10 శాతం నిజాలు మాత్రమే వెల్లడించానని ఇంకా 90 శాతం నిజాలు ఉన్నాయ

అన్నాడీఎంకే ప్రధానకార్యదర్శి శశికళ గుట్టును బహిర్గతం చేస్తానని తమిళనాడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం ప్రటించారు. ఇప్పటివరకు కేవలం 10 శాతం నిజాలు మాత్రమే వెల్లడించానని ఇంకా 90 శాతం నిజాలు ఉన్నాయనీ వాటిని కూడా వెల్లడిస్తానని తెలిపారు. శశికళపై పన్నీర్ సెల్వం తిరుగుబాటు బావుటా ఎగురవేసిన విషయం తెల్సిందే. 
 
ఇందులోభాగంగా, గత 2012లో నాటి ముఖ్యమంత్రి జయలలితకు శశికళ రాసిన ఓ లేఖను ఆయన బహిర్గతం చేశారు. ఎందుకంటే 2012లో శశికళను, ఆమె బంధువులను జయలలిత పోయెస్‌ గార్డెన్‌ నుంచి బయటకు గెంటివేశారు. ఆ సమయంలో తనను క్షమించాలంటూ శశికళ జయలలితకు లేఖ రాశారు. ఇప్పుడు ఆ లేఖను పన్నీర్‌ సెల్వం బయటపెట్టారు. 
 
ఆ లేఖలో ఏముందంటే.. ‘మా బంధువులు, మిత్రులు కొంతమంది నేను పోయెస్ గార్డెన్‌లో కలిసి ఉంటున్న సమయంలో నా పేరుని వాడుకుని అక్రమాలకు పాల్పడ్డారు. అన్నాడీఎంకేకు చెడ్డపేరు తీసుకొచ్చే విధంగా వ్యవహరించారు. అంతేకాకుండా మీకు(జయలలిత) వ్యతిరేకంగా కుట్రలు కూడా పన్నారు. ఇవన్నీ నాకు తెలియకుండానే జరిగాయి. కలలో కూడా నేను మీకు ద్రోహం తలపెట్టను. నా బంధువులు అక్రమాలకు పాల్పడ్డారు. ఇది మన్నించరానిది. 
 
నేను మీతో ఉన్నంత మాత్రాన రాజకీయాల్లోకి రావాలనిగానీ, పార్టీ పదవులు కట్టబెట్టాలని ఏనాడూ కోరలేదు. అసలు ప్రజా జీవితంలో ప్రవేశించాలన్న ఆశ నాకెప్పటికీ రాలేదు. నా జీవితాన్ని మీ కోసమే అర్పించాను. నన్ను క్షమించి మళ్లీ దగ్గరకు తీసుకోండి’ అని ఆ లేఖలో శశికళ పేర్కొన్నారు. కాగా తనకు తెలిసిన విషయాల్లో 10 శాతమే బయటపెట్టానని, ఇంకా 90 శాతం తనలోనే ఉన్నాయని పన్నీర్‌ చెప్పడం మరింత ఉత్కంఠను రేకెత్తిస్తోంది.