శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : ఆదివారం, 19 ఫిబ్రవరి 2017 (12:32 IST)

కొత్త పార్టీ యోచనలో పన్నీర్ సెల్వం.. పేరు అమ్మాడీఎంకే

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఓ పన్నీర్ సెల్వం కొత్త పార్టీ పెట్టే ఆలోచనలో ఉన్నారు. అమ్మాడీఎంకే అనే పేరుతో త్వరలో కొత్తపార్టీ ప్రకటించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఆయనతోపాటు 11 మందిపై స్పీకర్ అనర్హత వేటు వేయ

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఓ పన్నీర్ సెల్వం కొత్త పార్టీ పెట్టే ఆలోచనలో ఉన్నారు. అమ్మాడీఎంకే అనే పేరుతో త్వరలో కొత్తపార్టీ ప్రకటించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఆయనతోపాటు 11 మందిపై స్పీకర్ అనర్హత వేటు వేయనున్న నేపథ్యంలో ఆయన వేరే పార్టీలో చేరలేక కొత్త పార్టీ పెట్టనున్నట్లు తెలియవచ్చింది. 
 
శనివారం జరిగిన బలనిరూపణలో 11 మంది అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి పళనిస్వామికి వ్యతిరేకంగా ఓటు వేసిన విషయం తెలిసిందే. దీంతో పన్నీర్‌తో సహా 11 మందిని స్పీకర్ బహిష్కరించి, ఆరునెలల్లోగా ఎన్నికలకు వెళ్లాలని పళనిస్వామి వర్గం భావిస్తోంది. తద్వారా పన్నీర్ వర్గాన్ని పూర్తిగా రాజకీయాలకు దూరం చేయాలన్న ఆలోచనలో శశికళ వర్గం ఉంది. 
 
దీంతో ఆరునెలల్లో ఎన్నికల్లో పోటీ చేయాలంటే పన్నీర్‌కు ఉన్నటువంటి ఏకైక మార్గం పార్టీ పెట్టడం ఒక్కటిగానే కనిపిస్తోంది. ఉమ్మడి గుర్తుతో పోటీ చేయడంపై ఆయన ఒక నిర్ణయానికి వచ్చినట్లు కనిపిస్తోంది. అన్నాడీఎంకే స్థానంలో అమ్మాడీఎంకే పార్టీ పెట్టాలని ఆయన ఆలోచన చేస్తున్నట్లు తెలియవచ్చింది. దీనికి సంబంధించి ఈసీతో సంప్రదింపులు చేస్తున్నట్లు సమాచారం. 
 
ముఖ్యమంత్రి దివంగత జయలలితకు నిజమైన వారసుడిని తానేనని చెప్పడానికి ఆయన సిద్ధంగా ఉన్నారని, అందుకే ‘అమ్మ’ పేరుతోనే పార్టీ పెట్టి ప్రజల్లోకి వెళ్లే ఆలోచనలో పన్నీర్ సెల్వం ఉన్నట్లు సమాచారం. గతంలో ఎంజీఆర్ మృతితో అప్పట్లో డీఎంకే నుంచి బయటకు వచ్చిన జయలలిత ఆయన పేరుతో అన్నాడీఎంకే పార్టీని  స్థాపించి విజయం సాధించిన విషయం తెలిసిందే. ఇపుడు ఇదే పరిస్థితి పునరావృతమయ్యేలా కనిపిస్తోంది.