శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By PNR
Last Updated : ఆదివారం, 25 జనవరి 2015 (18:25 IST)

కొత్తగా బాధ్యతలు చేపట్టా.. ఏం చేయాలో నేతల మధ్య బంధమే నిర్ణయిస్తుంది: మోడీ!

తాను దేశ ప్రధానమంత్రిగా కొత్తగా బాధ్యతలు చేపట్టానని, అయితే, ఉభయ దేశాల అభివృద్ధి కోసం ఏం చేయాలో దేశాధినేతలే నిర్ణయిస్తారని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వ్యాఖ్యానించారు. ఢిల్లీకి వచ్చిన అమెరికా అధినేత బరాక్ ఒబామాతో కలిసి మోడీ ఆదివారం సంయుక్త మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. 
 
ఈ సందర్భంగా మోడీ మాట్లాడుతూ దేశ ప్రధానిగా కొత్తగా బాధ్యతలు చేపట్టాను. ఈ తక్కువ సమయంలో ఏది చేయాలో ఏది చేయకూడదో తనకు పెద్దగా అవగాహన లేదు.. అయితే, నేతల మధ్య ఉన్న బంధమే రెండు దేశాల మధ్య సంబంధాలు పటిష్టమవ్వాలో? లేదో నిర్ణయిస్తుందని చెప్పుకొచ్చారు. 
 
అంతేకాకుండా, కెమేరా ముందు మాట్లాడితే అందులో చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయని, అదే వ్యక్తిగతంగా మాట్లాడుకున్నప్పుడు భేషజాలకు తావు ఉండదని, మనసు విప్పి మాట్లాడే అవకాశం ఉంటుందని ఆయన చెప్పారు. ఈ సంబంధం అందరు నేతల మధ్య ఉండాలని ఆయన పేర్కొన్నారు.
 
ఆ తర్వాత బరాక్ ఒబామా స్పందిస్తూ మోడీ చెప్పిన దానితో తాను ఏకీభవిస్తున్నట్టు చెప్పారు. తామిద్దరం వ్యక్తులం కాదని, తామిద్దరం రెండు దేశాలకు ప్రతినిధులమన్నారు. తాము మాట్లాడుకునేటప్పుడు రెండు అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాల ప్రజలు మాట్లాడుకుంటున్నట్టని అన్నారు. తాను మోడీ ఉత్సాహాన్ని చూసి ఆశ్చర్యపోతుంటానని ఆయన చెప్పారు.