శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By PNR
Last Updated : గురువారం, 29 జనవరి 2015 (12:57 IST)

రేప్ చేసిన యువతిని జైల్లోనే వివాహం చేసుకున్న ఖైదీ!

ఒడిషాలో తాను అత్యాచారం చేసిన ఓ యువతిని ఒక ఖైదీ వివాహం చేసుకున్నాడు. తాను చేసిన తప్పును సరిదిద్దుకోవడమే కాకుండా, ఇతరులకు కూడా ఆదర్శప్రాయంగా నిలిచాడు. భువనేశ్వర్‌లోని ఝరపద జైలులో చోటు చేసుకున్న ఈ వివాహ ఘట్టం కేసు వివరాలను పరిశీలిస్తే... 
 
వృత్తి రీత్యా డ్రైవర్ అయిన నిందితుడు దిలీప్ బహేరా రాష్ట్ర రాజధాని భువనేశ్వర్ శివారులోని గ్రామ సమీపంలో బస్సు కోసం ఎదురు చూస్తున్న మహిళకు లిఫ్ట్ ఇవ్వడానికి ముందుకు వచ్చాడు. ఆమెను నిర్మానుష్యమైన ప్రదేశానికి తీసుకుని వెళ్లి అక్కడ ఆమెపై అత్యాచారం చేశాడు. ఈ సంఘటన గత యేడాది జనవరి 23వ తేదీన జరిగింది.
 
బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కొద్ది రోజుల తర్వాత బహేరాను అరెస్టు చేశారు. అప్పటి నుంచి అతను జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నాడు. తామిద్దరు వివాహం చేసుకోవడానికి అనుమతించాలని బాధితురాలు, నిందితుడు కోర్టుకు ఉమ్మడి దరఖాస్తు పెట్టుకున్నారు. వీరిద్దరి వాంగ్మూలాలను సేకరించిన కోర్టు వారి వివాహం జరిపించాలని జైలు అధికారులను ఆదేశించింది. కోర్టు ఆదేశాల మేరకు జైలు అధికారులు బుధవారం వివాహం జరిపించారు. ఈ వివాహ కార్యక్రమానికి ఇరు పక్షాలకు చెందిన న్యాయవాదులు, కుటుంబ సభ్యులు, జైలు అధికారులు ఈ వివాహానికి హాజరయ్యారు.