గురువారం, 18 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 4 నవంబరు 2016 (09:28 IST)

లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి జరగాలి : నరేంద్ర మోడీ

లోక్‌సభ, అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు జరగాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అభిప్రాయపడ్డారు. దేశంలో ఎన్నో అంశాలపై చర్చలు జరుగుతాయని, అయితే వాటిలో చాలా చర్చలు అర్థవంతమైన ముగింపు లేకుండానే ఆగిపోతున్నాయన్నార

లోక్‌సభ, అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు జరగాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అభిప్రాయపడ్డారు. దేశంలో ఎన్నో అంశాలపై చర్చలు జరుగుతాయని, అయితే వాటిలో చాలా చర్చలు అర్థవంతమైన ముగింపు లేకుండానే ఆగిపోతున్నాయన్నారు. చర్చల్ని సాగదీయడం సరైన విధానం కాదని అభిప్రాయపడ్డారు. ఆయా చర్చల్లో ఏదో ఒక నిర్ణయం తీసుకొనేలా మీడియా చురుకైన పాత్ర పోషించాలని సూచించారు. 
 
బీజేపీ ప్రధాన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... లోక్‌సభ, అసెంబ్లీకి ఒకేసారి ఎన్నికల నిర్వహణకు అన్ని పార్టీలు ప్రైవేటుగా మద్దతు పలుకుతాయని, కానీ ప్రజల్లోకి వచ్చేసరికి వెనకడుగు వేస్తున్నాయన్నారు. ఒకేసారి ఎన్నికల నిర్వహణకు.. కేంద్ర ఎన్నికల సంఘానికి మంచి అధికారులు అవసరమవుతారని, పెద్ద ఎత్తున ఖర్చు అవుతుందని ఇంకా చాలా ఇబ్బందులు కూడా ఉంటాయని మోడీ అభిప్రాయపడ్డారు. ఈ అంశంపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోబోదని, రాజకీయ పార్టీలే చొరవ తీసుకోవాలని స్పష్టం చేశారు. 
 
గతంలోనూ పారిశుద్ధ్యం గురించి దేశంలో చర్చ జరిగేదని, పరిసరాలు అపరిశుభ్రంగా ఉన్నాయంటూ అంతా మాట్లాడుకునేవారని, అయితే.. పరిశుభ్రతతో గౌరవం లభిస్తుందని, అభివృద్ధి జరుగుతుందని మాత్రం ఎవ్వరూ భావించలేదని, ప్రస్తుతం జరుగుతున్నంత స్థాయిలో పరిశుభ్రతపై అవగాహన, కార్యక్రమాలు ఎప్పుడూ జరగలేదన్నారు. రాష్ట్రాల మధ్య కూడా పోటీ ఏర్పడిందని, మూడు రాష్ట్రాలు ఇప్పటికే బహిరంగ మలవిసర్జన రహిత రాష్ట్రాలుగా ప్రకటించుకొన్నాయన్నారు.