శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By PNR
Last Updated : శుక్రవారం, 28 నవంబరు 2014 (15:01 IST)

బాబా రాంపాల్ అరెస్టు ఆపరేషన్ ఖర్చు రూ.26 కోట్లు!

వివాదాస్పద బాబా రాంపాల్‌ అరెస్టు కోసం చేపట్టిన ఆపరేషన్‌కు రూ.26 కోట్లు ఖర్చు అయినట్టు హర్యానా ప్రభుత్వం పేర్కొంది. ఈ మేరకు ఆ రాష్ట్ర హైకోర్టుకు ఒక అఫిడవిట్ రూపంలో సమర్పించింది. ఓ హత్య కేసులో ఇటీవల రాంపాల్ బాబాను అరెస్టు చేసిన విషయం తెల్సిందే. ఆయనకు విధించిన జ్యూడీషియల్ కస్టడీ గురువారంతో ముగియడంతో ఆయనను కట్టుదిట్టమైన భద్రత నడుమ జస్టిస్ ఎం జయపాల్, దర్శన్ సింగ్ డివిజన్ బెంచ్ ముందు హాజరుపరిచారు. కేసు విచారణ డిసెంబర్ 23వ తేదీకి వాయిదా పడింది. 
 
రాంపాల్ అరెస్టు సందర్భంగా హిస్సార్‌లోని బర్వాలా సత్‌లోక్ ఆశ్రమం వద్ద తీవ్ర ఘర్షణ, హింస చెలరేగిన విషయం తెలిసిందే. ఆ ఆపరేషన్‌పై హర్యానా డీజీపీ ఎస్ఎన్ వశిష్ట్ కోర్టుకు సవివరమైన నివేదికను సమర్పించారు. రాంపాల్‌ను అరెస్టు చేసి, కోర్టు ముందు హాజరు పరచడానికి అయిన వ్యయంపై హర్యానా, పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు కేంద్ర ప్రభుత్వం, చండీగఢ్ పాలనా యంత్రాంగం విడివిడిగా నివేదికలు సమర్పించాయి. 
 
రాంపాల్ ఆచూకీని కనిపెట్టి అరెస్టు చేయడానికి హర్యానా 15.43 కోట్ల రూపాయలు ఖర్చు చేయగా, పంజాబ్ రూ.4.34 కోట్లు, చండీగఢ్ పాలనా యంత్రాంగం రూ.3.29 కోట్లు, కేంద్ర ప్రభుత్వం 3.55 కోట్లు ఖర్చు చేసినట్టు పేర్కొన్నారు. దీంతో మొత్తం ఖర్చు 26.61 కోట్ల రూపాయలు అయినట్టు అఫిడవిట్‌లో పేర్కొన్నారు.