శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : గురువారం, 9 ఫిబ్రవరి 2017 (12:23 IST)

సోషల్ మీడియాలో అన్నాడీఎంకే ఎమ్మెల్యేల ఫోన్ నంబర్లు... సపోర్ట్ పన్నీర్ అంటూ ట్వీట్లు...

తమిళనాడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్న ఓ పన్నీర్ సెల్వంకు మద్దతు అంతకంతకూ పెరుగుతోంది. ముఖ్యంగా.. అన్నాడీఎంకే పార్టీకి చెందిన ఐటీ విభాగం ఆయనకు అండగా నిలిచింది. ఈ విభాగంలో కీలకమైన హరి ప్రభాకరన్, శ్రీరామ్

తమిళనాడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్న ఓ పన్నీర్ సెల్వంకు మద్దతు అంతకంతకూ పెరుగుతోంది. ముఖ్యంగా.. అన్నాడీఎంకే పార్టీకి చెందిన ఐటీ విభాగం ఆయనకు అండగా నిలిచింది. ఈ విభాగంలో కీలకమైన హరి ప్రభాకరన్, శ్రీరామ్ తదితరులు కలిసి గుట్టుచప్పుడు కాకుండా ఎమ్మెల్యేలందరి ఫోన్ నంబర్ల జాబితాను ట్విట్టర్ ఖాతాలో పెట్టి, పన్నీర్‌కు మద్దతు పలకాలని కోరే వారంతా, ఈ నంబర్లకు మెసేజ్‌లు చేయాలని కోరగా, మెసేజ్‌లు, ట్వీట్లు హోరెత్తిపోతున్నాయి. 
 
ఐటీ విభాగం షేర్ చేసిన ఎమ్మెల్యేల ఫోన్ నంబర్లను వేలాది మంది రీట్వీట్ చేసుకున్నారు. బుధవారం శశికళ సమావేశానికి వెళ్లి, ఆపై మాయమైన 26 మంది ఎమ్మెల్యేలు పన్నీర్‌కు మద్దతుగా ఉన్నారని ఈ ట్వీట్లలో కనిపిస్తోంది. మిగిలిన వాళ్లు పన్నీర్‌కు మద్దతుగా ఉంటేనే ప్రజామోదం లభిస్తుందని, లేకుంటే పరాభవం తప్పదని హెచ్చరిస్తున్నారు కూడా.
 
ఈ పరిణామాలతో ఖంగుతిన్న శశికళ వర్గం, ఐటీ విభాగం సిబ్బందిపై కన్నెర్ర జేసింది. అయితే వారిపై చర్య తీసుకోవడం మరింత వ్యతిరేకతకు దారిస్తుందని భావించిన శశికళ నష్టనివారణ చర్యలు చేపట్టారు. అయినప్పటికీ.. ఫలితం కనిపించడం లేదు. పెక్కుమంది అన్నాడీఎంకే నేతలతో పాటు.. మంత్రులు, ఎమ్మెల్యేలు, సాధారణ ప్రజానీకం పన్నీర్‌కు అండగా నిలుస్తుండటం గమనార్హం. 
 
మరోవైపు.. ఐటీ విభాగం ట్విట్టర్‌లో పెట్టిన ఎమ్మెల్యేల ఫోన్ నంబర్లు, ట్వీట్లను తొలగించడం అసాధ్యమన్నంత స్థాయిలో షేర్ అయిపోయాయి. ఇది ప్రజలకు, శశికళకు మధ్య జరుగుతున్న యుద్ధమని, పన్నీర్‌కు మద్దతివ్వాలని అన్నాడీఎంకే ఎమ్మెల్యేలపై శాంతియుత ఒత్తిడి తేవాలని తన ట్వీట్‌లో శ్రీరామ్ కోరారు. దీంతో ఆయనను ఆ విధుల నుంచి శశికళ తొలగించారు.