శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By chitra
Last Updated : గురువారం, 26 మే 2016 (13:17 IST)

ట్రాన్స్‌జెండర్‌కు చికిత్స చేయడంలో నిర్లక్ష్యం.. ప్రాణాలు విడిచిన హక్కుల కార్యకర్త

డాక్టర్ల నిర్లక్ష్యం ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. కొందరు అగంతకుల దాడితో శరీరంలోకి ఎనిమిది తూటాలు దిగబడిన ఆమెను.. ట్రాన్స్జెండర్ కావడం వల్ల పురుషుల వార్డులో ఉంచాలా లేక మహిళా వార్డులో ఉంచాలా అనే సందేహంతో డాక్టర్లు సుమారు నాలుగు గంటలు చికిత్స చేయలేదు. సరైన సమయంలో చికిత్స అందించకపోవడం వల్ల ట్రాన్స్జెండర్ యాక్టివిస్ట్ జీవితం గాలిలో కలిసిపోయింది. ఈ విషాద ఘటన పాకిస్థాన్లో చోటుచేసుకుంది. 
 
ఈ పూర్తి వివరాలను పరిశీలిస్తే ఖైబర్- పఖ్తున్ఖ్వ ప్రొవిన్స్‌లో ట్రాన్స్జెండర్ యాక్టివిస్ట్ అలీషాపై ఆదివారం రాత్రి కొందరు గుర్తు తెలియని దుండగులు కాల్పులకు పాల్పడ్డారు. ట్రాన్స్జెండర్ల హక్కులకై పోరాడుతున్న అలీషా వ్యవహారం నచ్చని కొందరు ఈ దారుణానికి పాల్పడినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన అలీషాను స్థానికులు పెషావర్లోని 'లేడీ రీడింగ్ హస్పిటల్'కు తరలించారు. 
 
బుల్లెట్ గాయాలతో తీవ్ర రక్తస్రావం అవుతున్న అలీషాకు ట్రీట్మెంట్ చేయడంలో డాక్టర్లు నిర్లక్ష్యం చూపించారు. ట్రాన్స్జెండర్ అనే కారణంచేత చికిత్సను సరైన సమయంలో ప్రారంభించలేదు. అంతేకాదు ఆ సమయంలో అలీషా స్నేహితులతో హాస్పిటల్ సిబ్బంది అసభ్యంగా ప్రవర్తించాడనే ఆరోపణలున్నాయి.