శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Raju
Last Updated :హైదరాబాద్ , సోమవారం, 9 జనవరి 2017 (08:50 IST)

పాన్ కార్డు లేదా.. అంతే సంగతులు..!

ఇంతవరకు ఆదాయ పన్నును ఎగవేసేందుకు లక్ష మార్గాలు కనిపెట్టి పన్ను చెల్లించకుండా తప్పించుకున్న బడా బాబులకు, పనిలో పనిగా మధ్యతరగతి ఆదాయ వర్గాలకు కేంద్రప్రభుత్వం పెద్ద జలక్ ఇచ్చింది. నల్లధనానికి, పన్ను ఎగవేతకు వ్యతికేరంగా మరో సమరానికి దారితీస్తూ కేంద్రం తాజాగా పెను చర్య తీసుకుంది. దేశంలో బ్యాంకు ఖాతాలు కలిగిన ప్రతి వ్యక్తీ ఇకపై తమ పాన్ సంఖ్యను తప్పనిసరిగా తన ఖాతాకు జత చేయవలసి ఉంటుంది. ఒక వేళ పాన్ నంబర్ లేకపోతే కనీసం ఫామ్-60 నయినా బ్యాంకుకు ఈ సంవత్సరం ఫిబ్రవరి 28లోగా జత సమర్పించాల్సి ఉంటుంది.
 
దీనికి సంబంధించి ఆదివారం కేంద్రప్రభుత్వం దేశంలోని అన్ని బ్యాంకులకు తమ ఖాతాదారులనుంచి పాన్ నంబర్ లేదా ఫారం-60ని తీసుకుని నమోదు చేయవలసిందిగా ఆదేశించింది. పెద్దనోట్ల రద్దు తర్వాత కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ చర్య పన్ను ఎగవేతదారులందరికీ ముకుతాడు బిగించనుందని భావిస్తున్నారు. ఇలా పాన్ సంఖ్య నమోదుకు సంబంధించి ఆదాయపన్ను నిబంధనలను కూడా కేంద్రం సవరించింది. ప్రత్యక్ష పన్నుల కేంద్ర మండలి ఈ విషయమై ఆదివారం నోటిఫికేషన్ విడుదల చేసింది.
 
బ్యాంకు ఖాతాలు కలిగి ఉండి కూడా పాన్ నంబర్‌ను సమర్పించని ఖాతాదారులు ఫిబ్రవరి 28లోగా తమ పాన్ సంఖ్యను లేదా ఫామ్-60ని తప్పనిసరిగా తమ బ్యాంకు బ్రాంచీలలో సమర్పించాల్సి ఉంటుందని ఈ నోటిఫికేషన్ సూచించింది.  అయితే జీరో బ్యాలెన్స్ సేవింగ్స్ ఖాతాలతో కూడిన బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్స్ ఖాతాలు (బిఎస్‌బిడిఎ) విషయంలో ఈ నిబంధన వర్తించదు. జనథన్ ఖాతాలు కూడా దీంట్లో భాగమే. ఉచిత ఏటీమ్ కార్డు, నెలవారీ స్టేట్‌మెంట్, చెక్ బుక్‌తో ప్రజల సాధారణ బ్యాంకింగ్ అవసరాలను తీర్చేందుకు ప్రవేశపెట్టిన ఖాతాలే బిఎస్‌బిడిఎ ఖాతాలు. 
 
పాన్ నంబర్ లేదా ఫామ్-60ని సమర్పించని ఖాతాలు కలిగిన వారి అకౌంట్లలో తగిన నగదు, డిపాజిట్లు ఉన్నప్పటికీ ఇలాంటి ఖాతాదారులు ఇకపై ఎలాంటి విత్ డ్రాయల్ చేసుకోలేరని, తమ ఖాతాలనుంచి నగదు, డిపాజిట్లను వెనక్కు తీసుకోలేరని గతనెల్లో ఆర్బీఐ స్పష్టం చేసింది.
 
అదే సమయంలో గత సంవత్సరం ఏప్రిల్ 1 నుంచి నవంబర్ 8 వరకు ఖాతాదారులు చేసిన నగదు డిపాజిట్లకు సంబంధించిన సమాచారాన్ని కూడా తప్పకుండా సమర్పించాలని కేంద్ర ప్రత్యక్ష పన్నుల కేంద్ర మండలి దేశంలోని అన్ని బ్యాకులు, పోస్టాఫీసులను ఆదేశించింది. పెద్ద నోట్లు రద్దు చేసిన తర్వాత 2016 నవంబర్ 9 నుంచి డిసెంబర్ 30 వరకు పరిమితిని మించి డిపాజిట్లు చేసిన వారి పూర్వ ఖాతాల నిర్వహణ చరిత్రను తెలుసుకోవడమే దీని ఉద్దేశమని భావిస్తున్నారు.