శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By PNR
Last Updated : మంగళవారం, 28 జులై 2015 (12:34 IST)

అబ్దుల్ కలాంకు పార్లమెంట్ ఘన నివాళి.. రేపు రామేశ్వరంలో అంత్యక్రియలు

భారత మాజీ రాష్ట్రపతి, భారతరత్న అబ్దుల్ కలాంకు పార్లమెంట్ ఉభయసభలు మంగళవారం ఘన నివాళి అర్పించాయి. ఆయన మృతిపట్ల సంతాపంగా రెండు నిమిషాల పాటు సభ్యులు మౌనం పాటించారు. ఈ సందర్భంగా లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ మాట్లాడుతూ, కలాం మృతి దేశానికి తీరని లోటన్నారు. 
 
భరతమాతకు కలాం చేసిన సేవలు వెలకట్టలేనివని కొనియాడారు. బరువైన హృదయంతో మహోన్నత వ్యక్తి కలాంకు వీడ్కోలు పలుకుతున్నామని చెప్పారు. రామేశ్వరంలో రేపు జరుగనున్న అంత్యక్రియలకు పార్లమెంటు సభ్యులంతా హాజరుకావాలని కోరారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. 'ఓం శాంతి శాంతి:' అంటూ తన ప్రసంగాన్ని స్పీకర్ సుమిత్రా మహాజన్ ముగించారు. అనంతరం సభను ఎల్లుండి ఉదయానికి వాయిదా వేశారు.
 
మరోవైపు... అబ్దుల్ కలాం స్వగ్రామమైన రామేశ్వరంలో రేపు అంత్యక్రియలు నిర్వహించాలని కేబినెట్ నిర్ణయించింది. కలాంకు నివాళిగా ఏడు రోజులు సంతాప దినాలుగా పాటించాలని ఆదేశించింది. భరతమాత తన ముద్దుబిడ్డను కోల్పోయిందని కేబినెట్ ఆవేదన వ్యక్తం చేసింది.