శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 30 నవంబరు 2015 (16:55 IST)

బీజేపీని విమర్శించే ప్రతి ఒక్కరూ దేశద్రోహులు కాదు : మహ్మద్ సలీం

భారతీయ జనతా పార్టీ పాలకులను విమర్శించే ప్రతి ఒక్కరూ దేశద్రోహులు కాదనీ సీపీఎం ఎంపీ మహ్మద్ సలీం అన్నారు. సోమవారం లోక్‌సభలో అసహనంపై 193 నిబంధన కింద చర్చ జరిగింది. ఇందులో తొలుత సలీం పాల్గొని ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. దేశంలో ఎన్ని మతాల వారు ఎంత సంఖ్యలో ఉన్నారనేది విషయం కాదు. ఒక దేశంలో వంద శాతం ఒకే మతం వారు ఉన్నా హేతుబద్ధంగా, తార్కికంగా ఆలోచించేవారికి, మిగిలిన వారి మధ్య ఘర్షణ సాగుతూనే ఉంటుంది. 
 
భారత స్వాతంత్ర్యం కోసం పోరాడిన ప్రతి ఒక్కరూ ఉత్తర దక్షిణ, తూర్పు పశ్చిమ భేదం అనేది లేకుండా అందరినీ ఒకే స్రవంతిలోకి తెచ్చేందుకు కృషి చేశారు. కానీ ప్రస్తుతం దేశంలో నిరంతర కులాలు, మతాలు, వర్గాలతో సమాజాన్ని విడగొట్టే ప్రయత్నం జరుగుతూనే ఉంది. ఇష్టం లేని వాళ్లు దేశం వదిలిపెట్టి పొమ్మంటున్నారు. ముస్లింలను పాకిస్థాన్ పొమ్మంటున్నారు. మరి నారాయణమూర్తిని, రఘురాం రాజన్‌ను ఎక్కడి పొమ్మంటారు? అని నిలదీశారు.  
 
గత 800 ఏళ్లలో తొలిసారి ఓ హిందూ ప్రభుత్వం ఏర్పడిందని కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ ఓ నివేదికలో అన్నట్లు సలీమ్ సభలో తెలిపారు. తాను ఔట్‌లుక్ పత్రికల్లో ప్రచురితమైన వ్యాఖ్యలనే ప్రస్తావించాను అని స్పష్టంచేశారు. తాను సభలో ప్రస్తావించింది తప్పని భావిస్తే ఉరి తీస్తారా.. తీయండి, ఏ శిక్ష వేస్తారో వేయండి అని అన్నారు. తాను చేస్తున్న ఆరోపణలు పత్రికల్లో ప్రచురితమైనవే అని సలీం ఉద్ఘాటించారు. 
 
విమర్శించే ప్రతి ఒక్కరూ దేశద్రోహులు కారు. మీరు చెప్పేది ప్రపంచం వింటున్నప్పుడు.. ప్రపంచం చెప్పేది మీరు వినండి. ఔట్ గోయింగ్ కాల్స్ మాత్రమే కాదు.. ఇన్‌కమింగ్ కాల్స్‌ను కూడా స్వీకరించండి. ఇది నియంతృత్వ పాలనలోని దేశం కాదు. ఇది ప్రజాస్వామ్య దేశం. ఎవరు ఏ ఆహారం తింటారన్నది అది వారి వారి వ్యక్తిగతమన్నారు.