గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : శనివారం, 21 జనవరి 2017 (18:54 IST)

జల్లికట్టు ఉద్యమం నుంచి ఆంధ్రులు నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది: పవన్ కల్యాణ్ ట్వీట్

తమిళనాట.. జల్లికట్టు కోసం శాంతియుతంగా జరిగిన ఉద్యమంపై ఇప్పటికే పలువురు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో తమిళులంతా ఏకమై జల్లికట్టుపై పోరాడారు. వీరి పోరాటం ఫలించింది. తమిళనాడు సంప్రదాయ క్రీడ

తమిళనాట.. జల్లికట్టు కోసం శాంతియుతంగా జరిగిన ఉద్యమంపై ఇప్పటికే పలువురు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో తమిళులంతా ఏకమై జల్లికట్టుపై పోరాడారు. వీరి పోరాటం ఫలించింది. తమిళనాడు సంప్రదాయ క్రీడ జల్లికట్టుపై ఆ రాష్ట్ర ఇంఛార్జి గవర్నర్‌ విద్యాసాగర్‌రావు జారీచేసిన ఆర్డినెన్స్‌ విషయంలో జనసేన అధినేత, ప్రముఖ సినీనటుడు పవన్‌ కల్యాణ్‌ స్పందించారు. 
 
జల్లికట్టుపై కేంద్రం తీసుకున్న నిర్ణయాన్నిపవన్ కల్యాణ్ స్వాగతించారు. సరైన సమయంలో ఇదో సముచిత నిర్ణయమన్నారు. తమిళుల సంఘటిత శక్తి, అహింసాయుత పద్ధతి తనను కదిలించాయన్నారు. ద్రవిడ సంస్కృతిపై తమిళుల మక్కువ, దాన్ని వారు కాపాడుకుంటోన్న వైనం కొనియాడదగినవని పవన్‌ పేర్కొన్నారు. తమిళనాడులో జరిగిన జల్లికట్టు ఉద్యమం నుంచి ఆంధ్రులు నేర్చుకోవాల్సింది ఎంతో ఉందని పవన్‌ ఈ సందర్భంగా గుర్తుచేశారు. 
 
రాజకీయ నేతలు కూడా ఇలాంటి సంఘీభావాన్ని ప్రదర్శించాలని కోరుకుంటున్నానన్నారు. జల్లికట్టు ఉద్యమ స్ఫూర్తితో రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించాలని పిలుపునిచ్చారు. అయితే, వ్యాపార అవసరాలు ఎక్కువగా ఉండి రాజకీయ నిబద్ధత తక్కువగా ఉన్న మన రాజకీయ నేతలు తమిళ ఉద్యమం నుంచి ఎంత వరకు స్ఫూర్తి పొందుతారనేదానిపై తనకు కొన్ని సందేహాలు ఉన్నాయన్నారు.
 
జల్లికట్టు నిషేధంపై తమిళనాడులో అంకురించిన ఉద్యమం గతంలో జరిగిన హిందీ వ్యతిరేక ఉద్యమంలా మారకముందే కేంద్ర ప్రభుత్వం విజ్ఞత ప్రదర్శించడంతో దేశ సమగ్రతకు భంగం తప్పిందని పేర్కొన్నారు. దేశ సంస్కృతి, సంప్రదాయాల వైవిధ్యాన్ని మున్ముందు గౌరవించకపోతే ఇలాంటి ఆందోళనలు తలెత్తే ప్రమాదం ఉందన్నారు.
 
తమిళుల పోరాట పటిమను ఈ ఉద్యమం ప్రతిబింబించిందన్నారు. కులమతాలకు అతీతంగా తమిళులంతా ఏకమై జల్లికట్టుపై నిషేధానికి వ్యతిరేకంగా నినదించడం స్ఫూర్తిదాయకమన్నారు. జల్లికట్టుపై నిషేధానికి నిరసనగా లక్షలాదిమంది మెరీనా బీచ్‌ చేరినప్పటికీ ఎక్కడా హింసకు తావులేకుండా నిర్వహించడం హర్షనీయమన్నారు.