శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ivr
Last Updated : సోమవారం, 23 జనవరి 2017 (21:08 IST)

చరిత్ర సృష్టించారు... ఇక ఆందోళన ఆపేయండి... జల్లికట్టు హింసాత్మకంపై రజినీకాంత్

దక్షిణాది సూపర్ స్టార్ రజినీకాంత్ జల్లికట్టు ఉద్యమం హింసాత్మకం కావడంపై ఆవేదన వ్యక్తం చేశారు. జల్లికట్టు ఉద్యమంతో చరిత్ర సృష్టించారని ఉద్యమకారులపై పొగడ్తలు కురిపించారు. జల్లికట్టు విషయంలో ఆమోదయోగ్యమైన

దక్షిణాది సూపర్ స్టార్ రజినీకాంత్ జల్లికట్టు ఉద్యమం హింసాత్మకం కావడంపై ఆవేదన వ్యక్తం చేశారు. జల్లికట్టు ఉద్యమంతో చరిత్ర సృష్టించారని ఉద్యమకారులపై పొగడ్తలు కురిపించారు. జల్లికట్టు విషయంలో ఆమోదయోగ్యమైన నిర్ణయం వస్తుందని విశ్వసిద్దామనీ, న్యాయవ్యవస్థపై నమ్మకం వుంచి ఈ ఆందోళనను విరమించాలంటూ సూపర్ స్టార్ రజినీకాంత్ పిలుపునిచ్చారు. మరోవైపు జల్లికట్టు ఉద్యమంలో చెలరేగిన హింసాత్మక ఘటనపై నటుడు లారెన్స్ కూడా స్పందించారు.
 
కేక్ కట్ చేసి సంతోషాన్ని పంచుకుందామని అనుకుంటుండగానే మెరీనా బీచ్ ఒడ్డున పరిస్థితి హింసాత్మకంగా మారినట్లు టీవీలో చూసి తెలుసుకుని షాక్ తిన్నానన్నారు. వెంటనే విద్యార్థులకు వాస్తవాన్ని వివరించి వారి ఆందోళనను విరమింపజేయాలని ప్రయత్నిస్తుంటే జల్లికట్టు కాకుండా ఇంకా ఏదేదో కొందరు మాట్లాడుతున్నారని చెప్పారు. విద్యార్థులయితే అలాంటి ప్రశ్నలను అడగరని చెప్పుకొచ్చారు. జల్లికట్టు సాధన ఉద్యమం శాంతియుతంగా ముందుకు సాగుతున్న సమయంలో కొన్ని బయటి శక్తులు లోపలికి చొరబడి ఉద్యమాన్ని హింసాత్మకంగా మార్చేందుకు ప్రయత్నం చేస్తున్నాయని మండిపడ్డారు.
 
జల్లికట్టు ఉద్యమం హింసాత్మకం కావడంతో తమిళనాడులో శాంతిభద్రతలకు విఘాతం కలుగుతోంది. విద్యార్థులు రోడ్లపై ఎక్కడికక్కడ బైఠాయించడంతో చెన్నైలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు జల్లికట్టు క్రీడకు తమిళనాడు ప్రభుత్వం నిబంధనలతో కూడిన బిల్లును తీసుకొచ్చింది. ఐతే శాశ్వతంగా ఆమోదయోగ్యమైన బిల్లును తీసుకురావాలంటూ జల్లికట్టు ఉద్యమకారులు మంకుపట్టు పడుతున్నారు. ఐతే, అలా చేస్తోంది విద్యార్థులు కాదనే అభిప్రాయాలు వెలువడుతున్నాయి.