శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By PNR
Last Updated : మంగళవారం, 27 జనవరి 2015 (11:18 IST)

కార్టూనిస్టు ఆర్కే లక్ష్మణ్ మృతిపై నరేంద్ర మోడీ సంతాపం!

ప్రముఖ కార్టూనిస్ట్ ఆర్కే లక్ష్మణ్ మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోడీ తన ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు. లక్ష్మణ్ మరణంపై విచారం వ్యక్తం చేస్తూ, ఆయన సోమవారం సాయంత్రం ప్రధాని ట్విట్టర్లో సంతాప సందేశాన్ని పోస్ట్ చేశారు. ఆయన మరణంతో దేశం గొప్ప కార్టూనిస్టును కోల్పోయిందని వ్యాఖ్యానించారు. తన విలువైన కార్టూన్లతో కోట్లాది మందిని నవ్వుల్లో ముంచెత్తిన లక్ష్మణ్ మృతి మనందరికి తీరని లోటని ఆయన పేర్కొన్నారు. 
 
కాగా, దేశంలో సుప్రసిద్ధ కార్టూనిస్టుగా పేరొందిన ఆర్కే లక్ష్మణ్ 94 యేళ్ల వయస్సులో కన్నుమూసిన విషయం తెల్సిందే. పుణేలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన సోమవారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. గతకొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. 
 
ఆయన పూర్తిపేరు రాశిపురం కృష్ణస్వామి లక్ష్మణ్. లక్ష్మణ్ 50 ఏళ్లపాటు 'టైమ్స్ ఆఫ్ ఇండియా'లో కామన్ మేన్ పేరిట కార్టూనిస్టుగా పనిచేశారు. కన్నడ వ్యంగ్య పత్రిక 'కొరవంజి'లోనూ వ్యంగ్య చిత్రకారుడిగా విధులు నిర్వర్తించారు. ప్రముఖ రచయిత ఆర్కే నారాయణ్‌కు లక్ష్మణ్ సోదరుడు.