మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By PNR
Last Updated : ఆదివారం, 27 జులై 2014 (11:41 IST)

మై గవ్ వెబ్‌సైట్‌ను ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోడీ!

నా దేశం, నా ప్రభుత్వం, నా భాగస్వామ్యం అనే నిదానంతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మే గావ్ (Mygov.nin.in) అనే వెబ్‌సైట్‌‍ను ప్రారంభించారు. దేశ ప్రజలకు సుపరిపాలన అందించడమే లక్ష్యంగా ఆయన చేపట్టిన చర్యల్లో భాగంగా ఈ వెబ్‌సైట్‌ను ప్రారంభించారు. 
 
పాలనలో ప్రజలకు భాగస్వామ్యం కల్పించేందుకు నరేంద్రమోడీ సర్కార్ కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. ప్రజలు తమ సూచనలు, సలహాలు, అభిప్రాయాలను ప్రభుత్వంతో పంచుకునేందుకు వీలుగా ‘మైగవ్' అనే వెబ్ సైట్‌ను ఆయన ప్రారంభించారు. గంగానది ప్రక్షాళన దగ్గర నుంచి మనదేశ యువతలో వృత్తి నైపుణ్యాలు పెంచడం వరకు... ఇలా ప్రతీ అంశం మీద ప్రజలు తమ సూచనలు, సలహాలు, అభిప్రాయాలు ప్రభుత్వానికి ఈ వెబ్ సైట్ ద్వారా తెలియజేయవచ్చు. 
 
కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడి శనివారానికి 60 రోజులు పూర్తయిన సందర్భంగా నరేంద్రమోడీ ఈ వైబ్‌సైట్‌ను ప్రారంభించారు. చాలామంది ప్రజలు జాతి నిర్మాణంలో భాగస్వామ్యం కావాలని కోరుకుంటున్నారని, దేశం కోసం తమ శక్తిని, శ్రమను ధారపోయడానికి సిద్ధంగా ఉన్నారని...ఈ 60 రోజులో తనకు అనుభవమైందని మోడీ ఈ సందర్భంగా అన్నారు. 
 
అలాంటి వారి కోసమే 'మై గవ్' పోర్టల్ ను ప్రారంభించామని మోడీ చెప్పారు. ప్రభుత్వంలో ప్రజల భాగస్వామ్యం లేకుండా ప్రజాస్వామ్యం విజయవంతం కాలేదని.... ప్రజలకు, ప్రభుత్వానికి ఉన్న అగాధాన్ని ఈ వేదిక పూడ్చివేయగలదని నరేంద్ర మోడీ అభిప్రాయపడ్డారు.