శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : మంగళవారం, 24 ఏప్రియల్ 2018 (17:33 IST)

బ్యాంకు ఖాతాల్లోకి రూ.15 లక్షల జమ... పీఎంవో స్పందనేంటి?

గత సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో ప్రధానమంత్రి అభ్యర్థిగా నరేంద్ర మోడీ సుడిగాలి ఎన్నికల ప్రచారం చేశారు. ఆ సమయంలో ఆయన ఇచ్చిన హామీల్లో ప్రధానమైనది ప్రతి పౌరుడి ఖాతాలోకి రూ.15 లక్షల నగదు జమచేస్తామని.

గత సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో ప్రధానమంత్రి అభ్యర్థిగా నరేంద్ర మోడీ సుడిగాలి ఎన్నికల ప్రచారం చేశారు. ఆ సమయంలో ఆయన ఇచ్చిన హామీల్లో ప్రధానమైనది ప్రతి పౌరుడి ఖాతాలోకి రూ.15 లక్షల నగదు జమచేస్తామని. ఈ నగదు కూడా.. విదేశాల్లో మగ్గుతున్న నల్లధనాన్ని స్వదేశానికి తెప్పించి ఆ సొమ్మును ప్రతి పౌరుడి ఖాతాలోకి డిపాజిట్ చేస్తామని ప్రకటించారు. ఈ హామీ ఇప్పటికీ ప్రజల మనసుల్లో గూడుకట్టుకునిపోయింది.
 
దీనిపై తాజాగా మోహన్ కుమార్ శర్మ అనే ఓ ఆర్టీఐ కార్యకర్త ప్రభుత్వాన్ని ప్రశ్నించాడు. ప్రధాని మోడీ చెప్పిన రూ.15 లక్షలు ప్రజల బ్యాంకు ఖాతాల్లో ఎప్పుడు వేస్తారో ఖచ్చితమైన తేదీ చెప్పాలని దరఖాస్తు చేశాడు. పెద్ద నోట్లు రద్దు చేసిన 18 రోజుల తర్వాత.. అంటే 2016 నవంబర్ 26న ఆర్టీఐ కార్యకర్త అడిగిన ఈ ప్రశ్నకు ప్రధానమంత్రి కార్యాలయం ఇప్పుడు స్పందించింది. సమాచార హక్కు చట్టం నిబంధనల ప్రకారం ఇది అసలు "సమాచారం" కిందికే రాదని స్పష్టంచేసింది. అందువల్ల దీనికి సమాధానం చెప్పడం కుదరదని తేల్చిచెప్పింది. 
 
అయితే ప్రధాని కార్యాలయం గానీ, ఆర్బీఐగానీ తనకు పూర్తి సమాచారం ఇవ్వలేదని మోహన్ కుమార్ శర్మ అంటున్నారు. మరోవైపు 2014 సార్వత్రిక ఎన్నికల్లో మోడీ ఇచ్చిన ఈ హామీ ఇప్పుడు ప్రతిపక్షాలకు బ్రహ్మాస్త్రంలా మారుతోంది. కాంగ్రెస్ పార్టీతో పాటు.. అన్ని రాజకీయ పార్టీలు దీన్ని అడ్డుపెట్టుకుని ప్రధాని మోడీపై విమర్శలు గుప్పించేందుకు సిద్ధమవుతున్నాయి.