బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By PNR
Last Updated : సోమవారం, 14 జులై 2014 (15:42 IST)

రాజ్యసభలో పోలవరం బిల్లు : నేతల కామెంట్స్...

పోలవరం బిల్లును రాజ్యసభలో కేంద్రం సోమవారం ప్రవేశపెట్టింది. పోలవరం ముంపు ప్రాంతాలను ఏపీలో కలిపేందుకు సభ ఆమోదం తెలిపింది. ఈ సందర్భంగా బిల్లుపై చర్చ జరగింది. ఇందులో వివిధ పార్టీల నేతలు చర్చలో పాల్గొని తమతమ అభిప్రాయాలను వెల్లడించారు. 
 
రాజ్‌నాథ్ సింగ్.. ప్రస్తుతం ఆంధ్రాలో కలిపిన ఏడు మండలాల్లోని గ్రామాలు 1958లో ఆంధ్రాలోనే ఉండేవి. భద్రాచలం తెలంగాణలోనే ఉంటుంది. ముంపు ప్రాంతాల ప్రజలకు ఏపీ సర్కారు పునరావాసం కల్పిస్తుందన్నారు. 
 
నందకుమార్.. పోలవరం ప్రాజెక్టును నిర్మించాల్సిందేనని బీజేపీ ఎంపీ నందకుమార్ అన్నారు. రాజ్యసభలో ఆయన మాట్లాడుతూ నిర్వాసితులకు పూర్తిగా న్యాయం చేయాలన్నారు. అయితే, పోలవరం ప్రాజెక్టు వల్ల ముంపునకు గురయ్యే అటవీసంపదపై కూడా ఆలోచించాల్సిన అవసరముందని ఆయన గుర్తు చేశారు. 
 
సీఎం రమేష్.. పోలవరం బిల్లుకు మద్దతిస్తున్నానని టీడీపీ ఎంపీ సీఎం రమేశ్ ప్రకటించారు. పోలవరం ఆర్డినెన్స్‌కు రాజ్యాంగబద్ధత ఉందన్నారు. పోలవరాన్ని ఎవరూ అడ్డుకోవద్దన్నారు. ఈ ప్రాజెక్టు వల్ల కృష్ణా, గోదావరి నదుల అనుసంధానం సాధ్యమన్నారు. పోలవరం డెవలప్ మెంట్ అథారిటీని ఏర్పాటు చేయాలన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసమే టీఆర్ఎస్ బిల్లును అడ్డుకునే ప్రయత్నం చేస్తోందని సీఎం రమేశ్ ఆరోపించారు. మూడేళ్లలో పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయాలని ఆయన కోరారు. 
 
డి. రాజా... పోలవరం ప్రాజెక్టు డిజైన్ మార్చాలని సీపీఐ నేత డి.రాజా అన్నారు. ఆయన మాట్లాడుతూ... పోలవరం ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్టు అని, రాష్ట్రాలకు సంబంధించి కాదని అన్నారు. కొత్త భూసేకరణ చట్టం ద్వారా గిరిజనులకు పునరావాసం కల్పించాలన్నారు. ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా డిజైన్ మార్చాని కోరారు. 
 
రాపోలు ఆనంద భాస్కర్... 4 లక్షల మంది ఆందోళనను కేంద్ర హోంమంత్రి అర్థం చేసుకోవాలని టీ కాంగ్రెస్ ఎంపీ రాపోలు ఆనంద భాస్కర్ అన్నారు. ముంపు ప్రాంతాల్లోని గిరిజనులు ఆందోళనతో ఉన్నారని అన్నారు. ఆందోళనతో గిరిజనులు నిద్రలేని రాత్రులను గడుపుతున్నారన్నారు. పోలవరం వల్ల భద్రాచలం ముంపునకు గురవుతుందని రాపోలు చెప్పారు. 
 
జైరాం రమేష్... బాధితులకు న్యాయం చేసేందుకు ముంపు గ్రామాలను ఆంధ్రప్రదేశ్‌లో కలపాల్సిన అవసరముందన్నారు. ముంపు ప్రభావాన్ని తగ్గించేందుకు రూ.600 కోట్లతో రక్షణ ఏర్పాట్లకు ఏపీ ప్రభుత్వం అంగీకరించిందని తెలిపారు. ఇప్పుడు తెలంగాణ నుంచి బదిలీ అవుతున్న గ్రామాలు 1959కి పూర్వం ఆంధ్రప్రదేశ్‌లోనే ఉండేవని గుర్తు చేశారు. 
 
భద్రాచలం పట్టణం, రామాలయం తెలంగాణ రాష్ట్రంలోనే ఉంటాయన్నారు. ముంపు గ్రామాలను మాత్రమే ఖమ్మం జిల్లా నుంచి తూర్పుగోదావరి జిల్లాకు బదలాయించాలని కేంద్ర కేబినెట్ ఫిబ్రవరి 12న నిర్ణయించిందని జైరాం పేర్కొన్నారు. పునరావాసానికి అవసరమైతే బిల్లులో సవరణలకు వెసులుబాటు కల్పిస్తామని ఆనాడు రాజ్యసభలో ప్రధాని మన్మోహన్ సింగ్ చెప్పారని ఆయన అన్నారు. ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో ఆర్డినెన్స్‌ను తీసుకురాలేకపోయామని చెపుతూ బిల్లుకు సంపూర్ణ మద్దతును జైరాం రమేష్ ప్రకటించారు.