శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pyr
Last Updated : బుధవారం, 1 జులై 2015 (17:37 IST)

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న రాష్ట్రపతి... అందరి సౌభాగ్యం కోరుకున్నా... ప్రణబ్

రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ బుధవారం మధ్యాహ్నం తిరుమల శ్రీవెంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. ప్రత్యేక వాహనంలో శ్రీవారి ఆలయ మహాద్వారం వద్దకు చేరుకున్న రాష్ట్రపతికి తితిదే ఈవో సాంబశివరావు, ఆలయ ప్రధాన అర్చకులు ఇస్తికపాల్‌ స్వాగతం పలికారు. మేళతాళాలతో రాష్ట్రపతి శ్రీవారి సన్నిధికి చేరుకున్నారు. అనంతరం ధ్వజస్తంభానికి నమస్కరించుకుని దర్శనానికి వెళ్ళారు. స్వామి వారి దర్శనం పూర్తిచేసుకున్న తరువాత ఆలయ అధికారులు ఆయనకు తీర్థప్రసాదాలను అందజేశారు. 
 
అర్చకులు వేద ఆశీర్వచనం అందించారు. అనంతరం ఆయన ఎస్వీబీసితో మాట్లాడుతూ, స్వామి వారిని దర్శించుకోవడం ఆనందంగా ఉందన్నారు. సర్వజనులు సుఖంగా ఉండేలా ఆశీర్వదించాలని స్వామిని కోరుకున్నట్లు ఆయన చెప్పారు. ఆయన వెంట తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్‌ నరసింహన్‌, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్నారు. క్షేత్ర సంప్రదాయాన్ని పాటిస్తూ ప్రణబ్‌ ముందుగా శ్రీవరాహస్వామి వారిని దర్శించుకున్నారు.  
 
రాష్ట్రప్రతి ప్రణబ్‌ముఖర్జీ ఈరోజు ఉదయం తిరుచానూరు పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు. గవర్నర్‌ నరసింహన్‌, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో కలిసి రేణిగుంట విమానాశ్రయం నుంచి నేరుగా తిరుచానూరు చేరుకున్న రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీకి ఆలయ అధికారులు, అర్చకులు ఘనస్వాగతం పలికారు. అనంతరం వారు ఆలయంలోని వెళ్లి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా పద్మావతి అమ్మవారికి రాష్ట్రపతి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కపిలతీర్థం దర్శించి అక్కడినుంచి నేరుగా తిరుమల వెళ్లారు.