శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By PNR
Last Updated : మంగళవారం, 28 జులై 2015 (15:00 IST)

యూపీఏ పాలకులకు ముచ్చెమటలు పోయించిన ప్రజా రాష్ట్రపతి అబ్దుల్ కలాం

అణు శాస్త్రవేత్తగా పేరుగడించిన.. రాష్ట్రపతి భవన్‌లో అడుగుపెట్టి ప్రజల రాష్ట్రపతిగా ఖ్యాతిగడించిన ఏపీజే అబ్దుల్ కలాం.. గత యూపీఏ పాలకులకు ముచ్చెమటలు పోయించారు. దీంతో నాటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ స్వయంగా రాష్ట్రపతి భవన్‌కు వెళ్లి వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. తనకు రాజకీయ నేపథ్యంలో లేకపోయినప్పటికీ.. కీలక బిల్లుల విషయంల ఇష్టానుసారంగా ప్రవర్తించలేరంటూ పాలకులను సుతిమెత్తగా హెచ్చరించారు.
 
 
అబ్దుల్ కలాం రాష్ట్రపతిగా ఉన్న సమయంలో ఆయన ముందుకు లాభదాయక పదవుల బిల్లు (ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్) వచ్చింది. ఈ బిల్లుపై తొలుత సంతకం చేసేందుకు ఆయన ససేమిరా అనడమే కాకుండా.. బిల్లును తిరిగి వెనక్కి పంపారు. ఆ తర్వాత ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ రాష్ట్రపతి భవన్‌కు వెళ్లి బిల్లుకు సంబంధించి వివరణ ఇచ్చారు. ఆ తర్వాత కూడా సంతృప్తి చెందని కలాం.. ఎంతో కష్టంతో కఠినమైన నిర్ణయం తీసుకుని ఆ బిల్లుపై సంతకం చేశారు.
 
మరో సందర్భంలోనూ కలామ్‌ ఇదే పరిస్థితిని ఎదుర్కొన్నారు. అదే.. ప్రధాన మంత్రి పదవికి సోనియా గాంధీ అభ్యర్థిత్వాన్ని పరిగణనలోకి తీసుకోకపోవడమే. 2004 ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఘన విజయం సాధించింది. సోనియా గాంధీ ప్రధాని రేసులో ముందున్నారు. ఆమె ప్రమాణ స్వీకారం చేయడమే తరువాయి. ఆమెను ప్రధానమంత్రిగా ఎంపిక చేస్తూ రాష్ట్రపతి భవన్‌ లేఖను కూడా రూపొందించింది.
 
అయితే, అప్పుడే ఆమె విదేశీయత అంశం తెరపైకి వచ్చింది. ఎన్ని ఒత్తిడులు ఉన్నా.. ప్రధాని అభ్యర్థిని తానే అని సోనియా ముందుకు వచ్చి ఉంటే తనకు మరో మార్గం ఉండేది కాదని, ఆమెనే నియమించాల్సి వచ్చేదని తన పుస్తకంలో కలాం పేర్కొన్నారు. కానీ ఆ పరిస్థితి తనకు ఎదురుకాలేదన్నారు.