శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By PNR
Last Updated : మంగళవారం, 28 జులై 2015 (13:04 IST)

పాలం ఎయిర్‌పోర్టులోనే కలాం పార్థివదేహానికి రాష్ట్రపతి, ప్రధాని నివాళులు

ఢిల్లీలోని పాలం విమానాశ్రయానికి చేరుకున్న భారత మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం భౌతిక కాయానికి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, రక్షణ మంత్రి మనోహర్ పారీకర్‌లు నివాళులు అర్పించారు. అంతకుముందు త్రివిధ దళాధిపతులు కూడా పుష్పాంజలి ఘటించారు.
 
 
సోమవారం మేఘాలయ రాజధాని షిల్లాంగ్‌లోని ఐఐఎం విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తున్న సమయంలో ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. ఆ తర్వాత ఆయనను నగరంలోని బెతాని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించినా ఫలితం లేకపోయింది. ఆస్పత్రిలో చేరిన గంటకే ఆయన తుదిశ్వాస విడిచారు. దీంతో దేశం ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురైంది. కలాం పార్థివదేహాన్ని మంగళవారం ఉదయం గౌహతి నుంచి భారత వైమానికదళానికి చెందిన ప్రత్యేక విమానంలో ఢిల్లీ పాలం విమానాశ్రయానికి తరలించారు. విమానాశ్రయానికే నేరుగా వచ్చిన రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి నివాళులు అర్పించారు. 
 
అంతకుముందు కలాం మృతికి లోక్‌సభ, రాజస్యభ అంజలి ఘటించాయి. ఇరు సభల సభ్యులందరూ రెండు నిమిషాల పాటు నిలబడి ఆయనకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలాం గొప్పదనాన్ని స్మరించుకున్నారు. అలాగే కలాం సేవలను కొనియాడుతూ కేంద్ర క్యాబినేట్ సంతాప తీర్మానం ప్రకటించింది. ఆయన విజన్‌ను, వివేకాన్ని కోల్పోయామని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ విచారం వ్యక్తం చేశారు.
 
మరోవైపు.. రాష్ట్రీయ ఆవిష్కార్ అభియాన్‌కు మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం పేరు పెడుతున్నట్టు కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి స్మృతి ఇరానీ తెలిపారు. అభియాన్ పథకాన్ని ఈ నెల 9న అబ్దుల్ కలాం ప్రారంభించారు. ఈ నేపథ్యంలోనే ఆ పథకానికి ఆయన పేరును పెట్టాలని ఈ రోజు జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో కేంద్రం నిర్ణయం తీసుకుంది.