మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 19 జూన్ 2017 (14:27 IST)

బీజేపీ కురువృద్ధుడి శకం ముగిసినట్టే : రాష్ట్రపతి అభ్యర్థిగా దళితనేత రామ్‌నాథ్ కోవింద్

భారతీయ జనతా పార్టీ కురువృద్ధుడు ఎల్కే.అద్వానీకి మరోమారు శృంగభంగమైంది. ఎన్డీయే కూటమి తరపున రాష్ట్రపతి అభ్యర్థిగా ఆయన పేరును ప్రకటిస్తారని భావించగా, కమలనాథులు మాత్రం ప్రతి ఒక్కరికీ తేరుకోలేని షాకిస్తూ..

భారతీయ జనతా పార్టీ కురువృద్ధుడు ఎల్కే.అద్వానీకి మరోమారు శృంగభంగమైంది. ఎన్డీయే కూటమి తరపున రాష్ట్రపతి అభ్యర్థిగా ఆయన పేరును ప్రకటిస్తారని భావించగా, కమలనాథులు మాత్రం ప్రతి ఒక్కరికీ తేరుకోలేని షాకిస్తూ.. ఎవరూ ఊహించని నేతను రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించారు. ఆయన పేరు రామ్‌నాథ్ కోవింద్. ప్రస్తుతం బీహార్ గవర్నర్‌గా పని చేస్తున్న 71 యేళ్ళ కోవింద్... దళిత సామాజిక వర్గమైన కోలి తెగకు చెందిన నేత. 
 
ఉత్తరప్రదేశ్ రాష్ట్రం కాన్పూర్‌ జిల్లాలోని దేరాపూర్ గ్రామంలో 1945 అక్టోబర్ ఒకటో తేదీన జన్మించిన ఈయన.. గతంలో బీజేపీకి రాజ్యసభ సభ్యుడిగా పని చేశారు. నాలుగేళ్లపాటు బీజేపీ దళిత మోర్చా అధ్యక్షుడిగా కూడా ఉన్నారు. వృత్తిరీత్యా న్యాయవాది అయిన రామ్‌నాథ్ అన్ని రాజకీయ పార్టీ నేతలకు ఆమోదయోగ్యుడిగా ఉన్నారు. 
 
దళితుల హక్కుల కోసం పోరాడిన రామ్‌నాథ్... బీజేపీలో కీలకమైన దళిత నేతగా ఎదిగారు. సుప్రీంకోర్టు, హైకోర్టుల్లో కూడా ఆయన న్యాయవాదిగా పని చేశారు. కాగా, ఎన్డీయే కూటమి తరపున రాష్ట్రపతి అభ్యర్థిని ప్రకటించే నేపథ్యంలో, ఢిల్లీలో బీజేపీ అగ్రనాయకత్వం సోమవారం భేటీ అయింది. అనంతరం రామ్‌నాథ్‌ను తమ అభ్యర్థిగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా మీడియా సమావేశంలో ప్రకటించారు.
 
మరోవైపు, పార్టీ సీనియర్ నేత అద్వానీని రాష్ట్రపతి అభ్యర్థిగా బీజేపీ ప్రకటించనున్నట్లు ఉదయం నుంచి ప్రచారం జరిగింది. అయితే, ఆ వార్తలకు ఫుల్‍‌స్టాప్ పెడుతూ రామ్‌నాథ్ పేరును అమిత్ షా ప్రకటించారు. దీంతో, అద్వానీకి చివరిసారిగా కూడా నిరాశే ఎదురైంది. రామ్‌నాథ్ పేరును ప్రకటించడంతో... బీజేపీలో అద్వానీ శకం ఇక ముగిసినట్టేనని విశ్లేషకులు చెబుతున్నారు. ఈనెల 23వ తేదీన రాష్ట్రపతి అభ్యర్థిగా రామ్‌నాథ్ నామినేషన్ దాఖలు చేసే అవకాశం ఉంది.