బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 17 జులై 2017 (08:58 IST)

నేడు రాష్ట్రపతి ఎన్నిక పోలింగ్ : రాంనాథ్ కోవింద్ ఎన్నిక లాంఛనమేనా?

దేశ అత్యున్నత పదవి రాష్ట్రపతి ఎన్నికకు సర్వం సిద్ధమైంది. సోమవారం దేశవ్యాప్తంగా 32 పోలింగ్‌ కేంద్రాల్లో ఎన్నికల ప్రక్రియను నిర్వహించనున్నారు. బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే కూటమి తరపున రాంనాథ్‌ కోవింద్‌ బర

దేశ అత్యున్నత పదవి రాష్ట్రపతి ఎన్నికకు సర్వం సిద్ధమైంది. సోమవారం దేశవ్యాప్తంగా 32 పోలింగ్‌ కేంద్రాల్లో ఎన్నికల ప్రక్రియను నిర్వహించనున్నారు. బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే కూటమి తరపున రాంనాథ్‌ కోవింద్‌ బరిలో ఉన్నారు. అలాగే, కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ కూటమి అభ్యర్థిగా లోక్‌సభ మాజీ స్పీకర్ మీరా కుమార్ పోటీ చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో మొత్తం 4896 మంది ప్రజాప్రతినిధులు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. 
 
రాష్ట్రపతి ఎన్నిక  కోసం అన్ని ఏర్పాట్లు చేయగా, ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్‌ ప్రక్రియ సాగుతుంది. ఈ నెల 20న ఓట్ల లెక్కింపు జరుపుతారు. నిబంధనల ప్రకారం ఎంపీలు పార్లమెంటులోనూ, ఎమ్మెల్యేలు ఆయా రాష్ట్రాల అసెంబ్లీల్లో ఏర్పాటు చేసిన పోలింగ్‌ కేంద్రాల్లో ఓటు హక్కును వినియోగించుకోవాల్సి ఉంది. సహేతుకమైన కారణముంటే ముందస్తుగా ఈసీ అనుమతి తీసుకొని వేరే పోలింగ్‌ కేంద్రాల్లో కూడా ఓటును వినియోగించుకొనే వెసులుబాటు ఉంది.
 
కాగా, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటువేసే ప్రజాప్రతినిధులు ఎన్నికల సంఘం ఇచ్చే ప్రత్యేక మార్కర్‌తోనే ఓటు వేయాల్సి ఉంటుంది. ఈ విధానాన్ని తొలిసారి అమలు చేస్తున్నారు. ఎంపీలకు ఆకుపచ్చ రంగు, ఎమ్మెల్యేల కోసం గులాబీ రంగులో ఉన్న బ్యాలెట్‌ పేపర్లను అందుబాటులో ఉంచారు. ఈసారి రాష్ట్రపతి ఎన్నికకు లోక్‌సభ సెక్రటరీ జనరల్‌ రిటర్నింగ్‌ అధికారిగా వ్యవహరిస్తున్నారు. గత రాష్ట్రపతి ఎన్నికకు రాజ్యసభ సెక్రటరీ జనరల్‌ రిటర్నింగ్‌ అధికారిగా వ్యవహరించిన విషయం విదితమే.
 
ఇదిలావుంటే, రాష్ట్రపతి ఎన్నిక సందర్భంగా సమాజ్‌వాదీ పార్టీ 2 శిబిరాలుగా చీలిపోయింది. ములాయం వర్గం కోవింద్‌కు, అఖిలేశ్‌ వర్గం మీరాకుమార్‌కు ఓటు వేయనుంది. అనారోగ్యం కారణంగా కరుణానిధి ఓటు హక్కును వినియోగించుకోవడంలేదు. ఒక్క ఎంపీ ఉన్న పీఎంకే ఈ ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు ఆ పార్టీ వ్యవస్థాపకుడు రాందాస్‌ ప్రకటించారు. కానీ, ఎంఐఎం మాత్రం మీరా కుమార్‌కు మద్దతు తెలపాలని నిర్ణయించింది. 9 మంది ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ ఉన్న ఎంఐఎం ఈమేరకు నిర్ణయం తీసుకుంది.