శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 31 మార్చి 2015 (09:09 IST)

పద్మశ్రీ విశ్వాసాన్ని మరింత పెంచింది.. నెం.1 కావాలి: పీవీ సింధు

దేశ పౌర పురస్కారాల్లో ఒకటైన ‘పద్మశ్రీ’ తమలో విశ్వాసాన్ని మరింత పెంచిందని, మరింత కష్టపడేందుకు స్ఫూర్తినిచ్చిందని డాక్టర్‌ మంజుల అనగాని, బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి పీవీ సింధు తెలిపారు. సోమవారం రాష్ట్రపతి భవన్‌లోని దర్బార్‌ హాలులో జరిగిన పురస్కార ప్రదానోత్సవ కార్యక్రమంలో రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ నుంచి వీరు పద్మశ్రీ అవార్డు, ప్రశంసాపత్రం అందుకున్నారు. మరో తెలుగు ప్రముఖుడు డాక్టర్‌ రఘురామ్‌ పిళ్లారిశెట్టి కూడా పద్మశ్రీ పురస్కారం స్వీకరించారు. 
 
ఈ సందర్భంగా సింధు మీడియాతో మాట్లాడుతూ.....పద్మశ్రీ అవార్డు స్వీకరించటం చాలా ఆనందంగా ఉందని, ఇది తన జీవితంలో అద్భుతమైన రోజని అన్నారు. ఈ అవార్డు తన బాధ్యతను, విశ్వాసాన్ని మరింత పెంచిందన్నారు. దేశం కోసం మరిన్ని పతకాలు గెలవాలని కోరుకుంటున్నానని, రాబోయే టోర్నమెంట్లలో బాగా రాణించేందుకు కృషి చేస్తానన్నారు. ప్రస్తుతం దేశంలో బ్యాడ్మింటన్‌కు మంచి ప్రోత్సాహం లభిస్తోందని, అమ్మాయిలు కూడా ఇందులో ఎక్కువగానే ఉన్నారని, మరింతమంది రావాలని ఆకాంక్షించారు. 
 
బ్యాడ్మింటన్‌లో ప్రస్తుతం మన దేశానికే చెందిన సైనా నెహ్వాల్‌ నెంబర్‌ వన్‌ స్థానంలో ఉందని, తాను కూడా ఆ స్థానానికి చేరుకోవాలని కోరుకుంటున్నానన్నారు. మంజుల అనగాని మాట్లాడుతూ.. పద్మశ్రీ అవార్డు ప్రకటించినప్పటి నుంచీ తాను చాలా సంతోషంగా ఉన్నానని, ఈరోజు మరింత ప్రత్యేకమైనదని చెప్పారు. తెలుగు రాషా్ట్రల్లో పెరుగుతున్న అవసరాలకు తగ్గట్లు వైద్య సదుపాయాలు మెరుగ్గానే ఉన్నాయని, అయితే ప్రజలు వాటిని అందిపుచ్చుకోవాల్సి ఉందన్నారు.