శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : బుధవారం, 8 ఫిబ్రవరి 2017 (11:38 IST)

శశికళపై వాయిస్ పెంచిన పన్నీర్.. అమ్మ మృతిపై అనుమానాలున్నాయ్... బలం నిరూపించుకుంటా!

తమిళనాడు ఆపద్ధర్మ సీఎం పన్నీర్ సెల్వం.. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళపై వాయిస్ పెంచారు. దివంగత ముఖ్యమంత్రి జయలలిత మృతిపై కొన్ని అనుమానాలు ఉన్నాయని పన్నీర్‌ సెల్వం మీడియా ముందు మాట్లాడుతూ తెలపడం

తమిళనాడు ఆపద్ధర్మ సీఎం పన్నీర్ సెల్వం.. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళపై వాయిస్ పెంచారు. దివంగత ముఖ్యమంత్రి జయలలిత మృతిపై కొన్ని అనుమానాలు ఉన్నాయని పన్నీర్‌ సెల్వం మీడియా ముందు మాట్లాడుతూ తెలపడం సంచలనం రేపింది. జయ మృతిపై విచారణకు ఆదేశిస్తామని పన్నీరు ప్రకటించారు. రిటైర్డ్‌ జడ్జితో దర్యాప్తునకు ఆదేశిస్తామని తెలిపారు. 
 
అంతేగాకుండా జయలలితకు ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్న సమయంలో శశికళ దారుణంగా వ్యవహరించిందని పన్నీరు వ్యాఖ్యానించడం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమైంది. జయలలితను కలిసేందుకు తనకు కూడా శశికళ అనుమతివ్వలేదని పన్నీరు ఆవేదన వ్యక్తం చేశారు. అమ్మ తనను కలవకుండా శశికళ అడ్డుపడి ఉండొచ్చనే సందేహాన్ని పన్నీరు సెల్వం వెలిబుచ్చారు. దీంతో ఇన్నాళ్లు జయలలిత మరణం వెనుక శశికళ పాత్ర ఉన్నట్లు ప్రజల్లో ఉన్న అనుమానాలు పన్నీరు వ్యాఖ్యలతో మరింత బలపడ్డాయి.
 
ఇంకా తానెప్పుడూ పార్టీకి ద్రోహం చేయలేదని... పార్టీకి వ్యతిరేకంగా ఎప్పుడూ మాట్లాడలేదని.. మాట్లాడబోమని పన్నీర్ సెల్వం స్పష్టం చేశారు. చెన్నైలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. అన్నాడీఎంకే అధికారంలో ఉన్నా.. లేకున్నా పార్టీకి విధేయుడిగా ఉన్నానన్నారు. జయలలిత మృతిపై తనకు అనుమానాలున్నాయని.. దీనిపై సుప్రీంకోర్టు న్యాయమూర్తితో విచారణ జరిపిస్తామన్నారు. 
 
ప్రజల్లో ఉన్న అనుమానాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని చెప్పుకొచ్చారు. తనను భాజపా వెనకుండి నడిపిస్తోందని వస్తున్న వార్తల్లో నిజం లేదన్నారు. రాజీనామా వెనక్కి తీసుకునే అవకాశం ఇస్తే తీసుకుంటానన్నారు. అసెంబ్లీలో తన బలం నిరూపించుకుంటానని.. శాసనసభ జరిగితే తనకు మద్దతిచ్చే సభ్యుల సంఖ్య గణనీయంగా పెరుగుతుందని ధీమా వ్యక్తం చేశారు.