గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 5 ఫిబ్రవరి 2016 (14:08 IST)

బెంగుళూరులో జాత్యహంకార దాడి : బీజేపీ సభ్యుడితో సహా ఐదుగురి అరెస్టు

టాంజానియా దేశానికి చెందిన యువతిపై బెంగుళూరులో జరిగిన జాత్యహంకార దాడి కేసులో స్థానిక భారతీయ జనతా పార్టీకి చెందిన సభ్యుడితో పాటు మొత్తం ఐదుగురిని బెంగుళూరు నగర పోలీసులు అరెస్టు చేశారు. అదేవిధంగా ఈ ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరిపేందుకు టాంజానియా దేశానికి చెందిన దౌత్య బృందం కూడా బెంగుళూరుకు ప్రత్యేకంగా వస్తోంది. 
 
కాగా, టాంజానియాకు చెందిన 21 ఏళ్ల యువతిని బెంగళూరులో వివస్త్రను చేసి దాడి చేసిన విషయంతెల్సిందే. దీనిపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. దౌత్యపరంగానూ ఒత్తిడి పెరగడంతో కేంద్రం రంగంలోకి దిగింది. ఘటనకు కారణమైన ఐదుగురిని కర్ణాటక పోలీసులు గురువారం అరెస్టు చేశారు.
 
బెంగళూరులో గత నెల 31న సూడాన్‌కి చెందిన అహ్మద్‌ డ్రైవ్‌ చేస్తున్న కారు.. దంపతులను ఢీకొంది. ప్రమాదంలో భార్య అక్కడికక్కడే మరణించగా, భర్త తీవ్రంగా గాయపడ్డారు. ఘటనపై ఆగ్రహానికి గురైన స్థానికులు అహ్మద్‌ కారును తగులబెట్టారు.
 
పోలీసులు అహ్మద్‌ను అదుపులోకి తీసుకున్నారు. అదేసమయంలో స్థానికంగా బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌ చదువుతున్న టాంజానియాకి చెందిన 21 ఏళ్ల యువతి, తన నలుగురి స్నేహితులతో కలిసి కారులో అటువైపు వచ్చారు. అప్పటికే ఆగ్రహంతో ఉన్న స్థానికులు వారిపైనా దాడి చేశారు. కారును తగులబెట్టారు. టాంజానియా యువతిని వివస్త్రను చేసి, దాడి చేశారు. జరిగిన ఘటనపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు ప్రయత్నించగా, వారు ఫిర్యాదు తీసుకొనేందుకు నిరాకరించారు. 
 
ఈ విషయం తెలుసుకున్న టాంజానియా హైకమిషన్‌ కార్యాలయం శరవేగంగా స్పందించింది. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించి చర్యలు తీసుకోవాలని విదేశీ వ్యవహారాల శాఖకు లేఖ రాసింది. కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్‌ గురువారం కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకు ఫోన్‌ చేశారు. టాంజానియా యువతిపై దాడి, అనంతరం పరిణామాల గురించి తెలుసుకున్నారు. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తుందని, ఇప్పటికే ఐదుగురిని అరెస్టు చేశామని సిద్ధరామయ్య కేంద్ర మంత్రికి తెలిపారు.