మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By PNR
Last Updated : గురువారం, 16 ఏప్రియల్ 2015 (14:46 IST)

రాహుల్ ఎక్కడున్నారు.. ఏం చేశారు..? భద్రతా సిబ్బందికి హుకుం...

ఏఐసీసీ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ 57 రోజుల అజ్ఞాతం తర్వాత గురువారం న్యూఢిల్లీకి చేరుకున్నారు. అయితే, ఆయన ఇన్నాళ్లు ఆయన ఎక్కడున్నారు? ఏం చేశారు? అనే దాని పైన విస్తృతంగా చర్చ జరుగుతోంది. ఆగ్నేయాసియాలోని వియాత్నం నుంచి భారత్‌‌కు థాయ్ ఎయిర్‌వేస్‌లో చేరుకున్నారు. అయితే, ఆయన కొద్ది రోజుల పాటు బ్యాంకాక్ ఉన్నట్టు సమాచారం. 
 
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలకు డుమ్మా కొట్టి రాహుల్.. ఫిబ్రవరి 22వ తేదీ నుండి అజ్ఞాతంలోకి వెళ్లారు. ఈ రెండు నెలల కాలంలో ఆయన యాగ్నోన్, మయన్మార్‌లలో మెడిటేషన్‌కు ఫేమస్ అయిన సెంటర్‌లలో ధ్యాన శిక్షణ తీసుకున్నట్టు సమాచారం. ఉరుగ్వేలో కొంతకాలం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఆయన బ్యాంకాక్ నుంచి బుధవారం రాత్రి తిరిగి వచ్చేందుకు సిద్ధం కాగా, విమానం ఆలస్యం కారణంగా ఆయన గురువారం ఉదయానికి ఢిల్లీకి చేరుకున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. 
 
మరోవైపు.. తన 57 రోజుల అజ్ఞాత వివరాలను బహిర్గతం చేస్తే బాగోదని తన వ్యక్తిగత భద్రతా సిబ్బందికి కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ హుకుం జారీ చేశారు. సరిగ్గా బడ్జెట్ సమావేశాలకు ముందు రెండు వారాల పాటు సెలవు పెట్టేసి చెక్కేశారు. అసలే పరాజయం...ఆపై అధికార పక్షం ముప్పేట దాడి. కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన ఆయనకు రెండు వారాల సెలవంటే, జనం కూడా సరేలే అనుకున్నారు. ఆ రెండు వారాల సెలవు ఏకంగా రెండు నెలలకు పొడగించారు. దీంతో రాహుల్ అజ్ఞాతవాసంపై దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరిగింది. పైగా ప్రజలకు పట్టరాని ఆగ్రహం తెప్పించారు. 
 
సరేలే వచ్చేశారుగా, ఎక్కడికెళ్లారో చెప్పి ప్రజలను శాంతపరుస్తారునుకుంటే, రాహుల్ గాంధీ తన మొండి పట్టుదలను వీడేలా కనిపించడం లేదు. పర్యటన వివరాలను బటయకు వెల్లడించడానికి వీల్లేదంటూ ఆయన తన భద్రతా సిబ్బందికి హుకుం జారీ చేశారట. మరి ఈ తరహా చర్యకు సంబంధించి రాహుల్ పై ప్రత్యర్థి పార్టీలు ఏ విధంగా విరుచుకుపడతాయో చూడాలి. సుమారు రెండు నెలల తర్వాత హస్తినకు చేరుకున్న రాహుల్ గాంధీని ఆయన తల్లి సోనియా గాంధీ, సోదరి ప్రియాంకా వాద్రాలు గురువారం కలుసుకున్నారు. రాహుల్ రాకతో ఢిల్లీలోని రాహుల్ నివాసం వద్ద కాంగ్రెస్ కార్యకర్తల సందడి వాతావరణం నెలకొంది.