గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By PNR
Last Updated : ఆదివారం, 29 మార్చి 2015 (15:11 IST)

అమేథీ, రాయ్‌బరేలి రెండు కళ్లులాంటివి..... : సోనియా గాంధీ

అమేథీ, రాయ్‌బరేలి నియోజకవర్గాలు తమకు రెండు కళ్లులాంటివని కాంగ్రెస్ అధినేత్రి సోనియా వ్యాఖ్యానించారు. తన నియోజకవర్గం, రాహుల్ నియోజకవర్గం అనే భేదాలు లేవని స్పష్టం చేశారు. వీలైనంత తొందరలో మీముందుకు (ప్రజా జీవితంలోకి) రాహుల్ వస్తారని చెప్పారు. 
 
కాంగ్రెస్ పార్టీ తనకు గుండెకాయగా భావించే యూపీలో... అదీ రాహుల్, సోనియా ప్రాతినిథ్యం వహించే పార్లమెంట్ నియోజకవర్గాల్లోనే పార్టీకి తీవ్రనష్టం జరుగుతుండటం గమనించిన అధినేత్రి సోనియా తనే స్వయంగా రంగంలోకి దిగారు. రాయ్‌బరేలి, అమేథీలో ఆమె శనివారం విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె పై విధంగా వ్యాఖ్యానించారు. 
 
రాహుల్ వ్యవహారం పార్టీ మొత్తానికే చేటు తెచ్చేలా ఉందని గ్రహించిన కాంగ్రెస్ అధిష్టానం నష్టనివారణ చర్యలకు పూనుకుంది. పార్టీ పెద్దలు ఇప్పటికే అవసరమున్నా, లేకున్నా... దీనిపై సానుకూలమైన వివరణలు ఇచ్చుకున్నారు. రాహుల్ విశ్రాంతి తీసుకుంటున్నారని కొందరంటే... కాదు కాదు పార్టీ వ్యవహారాలు చక్కదిద్దుతున్నారని ఇంకొందరు ఎవరికి వారు వాదనలు వినిపించారు. 
 
ఇంతలో యూపీలో రాహుల్‌ ఆచూకీ తెలిపిన వారికి బహుమానం ఇస్తామంటూ పోస్టర్లు అంటించారు. ఆయన ఆచూకి తెలిపితే తగిన పారితోషికం ఇస్తామంటూ... యూపీలో పోస్టర్లు వెలుస్తూనే వున్నాయి. అమేధీ, బులంద్‌ షహార్, అలహాబాద్‌ ప్రాంతాల్లో రాహుల్ అభిమానులే పోస్టర్లు అతికించారు. ఇవి మరింత కలకలం రేపాయి. 
 
దీంతో రంగంలోకి దిగిన సోనియా గాంధీ పలు ప్రాంతాల్లో పర్యటిస్తూ... కొన్ని గ్రామాల్లో కాలినడకన తిరుగుతూ కార్యకర్తలను పలకరించారు. వారి సమస్యలు సావధానంగా విన్నారు. సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగానే రాహుల్‌ త్వరలోనే వస్తారని ఆమె స్పష్టం చేశారు. కాగా, రాహుల్ గాంధీ ఫిబ్రవరి 16వ తేదీ నుంచి దీర్ఘకాల సెలవుపై ఉన్నారు.