శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ivr
Last Modified: గురువారం, 26 ఫిబ్రవరి 2015 (19:36 IST)

రైల్వేబడ్జెట్ పై టీడీపీ అసంతృప్తి... రెండు తెలుగు రాష్ట్రాలకు నిల్... వాళ్లేమన్నారంటే...

పార్లమెంటులో గురువారంనాడు కేంద్ర రైల్వే శాఖామంత్రి సురేష్ ప్రభు ప్రవేశ పెట్టిన రైల్వే బడ్జెట్ మీద విమర్శలు, ప్రశంసలు వస్తూనే ఉన్నాయి. కొందరు ట్విట్టర్లో ఫైర్ అవుతుంటే మరికొందరు ఫేస్బుక్ లో కామెంట్ చేస్తున్నారు. ములాయం సింగ్, జేపీ వంటి నేతలు మంచి బడ్జెట్ నే ప్రవేశ పెట్టారని పొగడుతుండగా, కొత్త ప్రాజెక్టుల ఊసే లేదనీ, కొత్త రైళ్లు లేవని మరికొన్ని పార్టీలు విమర్శిస్తున్నాయి.
 
సమాజ్ వాదీ పార్టీ చీఫ్ ములాయం సింగ్ యాదవ్ గురువారంనాడు కేంద్ర రైల్వేశాఖా మంత్రి సురేష్ ప్రభు ప్రవేశపెట్టిన రైల్వే బడ్జెట్ 2015 సూపర్ అంటూ కొనియాడారు. గత ప్రభుత్వాలు కొత్త ప్రాజెక్టులను చెప్పడం తప్పించి వాటిని పూర్తి చేయలేదని విమర్శించారు. సురేష్ ఆ తప్పు చేయకుండా గతంలో ప్రకటించిన ప్రాజెక్టులను పూర్తి చేస్తానని బడ్జెట్టులో చెప్పడం సంతోషంగా ఉందన్నారు.
 
ఇంకా కేంద్ర రైల్వే శాఖ మంత్రి సురేష్ ప్రభు ప్రవేశ పెట్టిన బడ్జెట్ అద్భుతమని లోక్ సత్తా నేత జయప్రకాశ్ నారాయణ అన్నారు. వాస్తవ  పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకున్నారని చెప్పారు. రైల్వే బడ్జెట్ అంటే కొత్త రైళ్లు, భారీ సంఖ్యలో ప్రాజెక్టులు కాదన్నారు. దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని బడ్జెట్ రూపొందించారన్నారు. 
 
అలాగే రైల్వే బడ్జెట్ అద్భుతంగా ఉందని కేంద్రమంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ అన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా సాంకేతికతకు పెద్ద పీట వేశారన్నారు. ఇకపోతే.. ఈ బడ్జెట్ సమతుల్యంగా ఉందని కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తెలిపారు. 
 
అయితే పార్లమెంటులో గురువారం ప్రవేశ పెట్టిన రైల్వే బడ్జెట్ ప్రజా వ్యతిరేక బడ్జెట్ అని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ విమర్శించారు. రైల్వే ఛార్జీలు పెంచలేదని వ్యాఖ్యలను ఆమె ఖండించారు. ఛార్జీలు పెంచలేదని చెబుతున్న ఎన్డీయే సర్కారు తొలినాళ్లలోనే వాటిని పెంచిందన్నారు.