శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By PNR
Last Updated : ఆదివారం, 27 జులై 2014 (13:39 IST)

వెస్ట్ బెంగాల్‌లో బ్లాక్ మెయిల్ చేస్తూ... రైల్వే ఉద్యోగినిపై సహచరుల గ్యాంగ్ రేప్!

మహిళలపై జరుగుతున్న అత్యాచారాల సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది. తాజాగా పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఓ రైల్వే ఉద్యోగినపై ఆమె సహచరులే గత కొద్ది రోజులుగా సామూహిక అత్యాచారం చేస్తూ వచ్చిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. చిత్పూరు రైల్వే యార్డ్‌లో ఈ ఘటన చోటుచేసుకుందని బాధితురాలు ఓ టీవీ ఛానెల్ కిచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొంది. తన సహచరులు రోజుల తరబడి గ్యాంగ్ రేప్ చేశారని పోలీసులకు ఫిర్యాదు చేసింది. నలుగురు సహచరులు చాలాసార్లు తనపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని ఆమె చెప్పింది.
 
అంతేకాకుండా, రేప్ చేస్తుండగా తన నగ్న చిత్రాలు, వీడియో చిత్రీకరించి జరిగిన దారుణం బయటపెడితే ఇవి బయటపెడతామని బెదిరించి, బ్లాక్ మెయిల్ చేసి, మరీ సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని ఆమె వెల్లడించింది. ఈ విషయాన్ని తన ఉన్నతాధికారులకు, పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు ప్రయత్నించగా, పోలీసులు తనను చాలా చులకనగా మాట్లాడారని ఆమె తెలిపారు. 
 
దీనిపై సుమొటోగా కేసు నమోదు చేసిన మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ సునంద ముఖర్జీ, సామూహిక అత్యాచారానికి పాల్పడిన వారిపైన, ఆమెను అవహేళన చేసిన ప్రతి ఒక్కరిపైన చర్య తీసుకుంటామని స్పష్టం చేశారు. 
 
పశ్చిమబెంగాల్ శిశు సంక్షేమ శాఖ మంత్రి సాహసి పంజా తక్షణ చర్యలకు ఆదేశించారు. సమగ్ర దర్యాప్తు నివేదిక అందజేయాలని, దోషులను న్యాయస్థానం ముందు ప్రవేశపెట్టాలని ఆమె ఆదేశాలు జారీ చేశారు. సంచలనం రేపిన ఈ ఘటనపై బెంగాల్ వ్యాప్తంగా ఆందోళన రేగుతోంది.