శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ESHWAR
Last Updated : మంగళవారం, 22 జులై 2014 (12:01 IST)

రాజీవ్ హత్యకేసు హంతకురాలు నళిని నిరాహారదీక్ష!

దివంగత ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో జీవితకారాగార శిక్షననుభవిస్తున్న నళిని తన భర్త మురుగన్‌ను కలవడానికి అనుమతినివ్వాలని కోరుతూ... వేలూరు కేంద్ర కారాగారంలో నిరాహారదీక్షను ప్రారంభించింది. రాజీవ్ హత్య కేసులో నళినికి ఉరిశిక్షపడగా, అనంతరం జీవితఖైదుకు మార్చారు. గత 10 ఏళ్లకు పైగా జైలు శిక్షననుభవిస్తున్న నళిని, ఆమె భర్త మురుగన్‌ను వేలూరు జైల్లో ఉంచిన విషయం విదితమే. 
 
అయితే నళినిని ఇటీవల వేలూరు జైలు ప్రాంగణంలోనే... ప్రత్యేక మహిళా జైలులోకి తరలించారు. ఇదిలావుండగా, భర్త మురుగన్‌ను కలిసి, ఆయనతో మాట్లాడటానికి జైలు అధికారులను అనుమతి కోరిన నళినికి చుక్కెదురైంది. దీంతో ఆమె జైల్లో నిరాహారదీక్ష ప్రారంభించారు. గత రెండు రోజులుగా నిరాహారదీక్ష చేస్తున్న నళినితో వేలూరు జైలు సూపరింటెండెంట్ రాజ్యలక్ష్మి చర్చలు జరిపారు. అయితే ఆ చర్చలు సఫలం కాలేదు. 
 
కానీ నళిని తన భర్తను కలుసుకోవడానికి జైలు అధికారులు అనుమతినిచ్చేవరకు దీక్షను కొనసాగిస్తానని పేర్కొన్నట్లు సమాచారం. ఇదిలావుండగా, ఈ ఏడాది ఫిబ్రవరిలో తన తండ్రి అనారోగ్యంగా ఉన్నట్లు, ఆయనను కలవడానికి నెలరోజులు సెలవు కోరుతూ... మద్రాసు ఉన్నత న్యాయస్థానంలో  నళిని పిటిషన్‌ను దాఖలు చేశారు. అయితే... దీనికి సంబంధించి వేలూరు జైలు అధికారులు వివరాలను అందించాలంటూ... ఉన్నతన్యాయస్థానం  ఉత్తర్వులు జారీ  చేసింది. 
 
ఈ మేరకు నళిని తండ్రి వద్ద ఆయన కుమారుడు, బంధువులున్నారని, ఆయనకు ఎటువంటి అనారోగ్యం లేదనే సమాచారం తమకు అందిందని,  అలాగే నళిని సెలవు కోరడంలో పలువురు నేతలు రాజకీయ లబ్ది పొందడానికి అవకాశం ఉందనే పలు వివరాలను వేలూరు జైలు అధికారులు న్యాయస్థానానికి సమర్పించారు. దీంతో నళినికి సెలవు మంజూరు కాకపోవడం గమనార్హం. ఈ నేపథ్యంలో ఆమె తన భర్తను కలిసి మాట్లాడటానికి జైలు అధికారులను అనుమతి కోరగా, వారు నిరాకరించడంతో ప్రస్తుతం ఆమె నిరాహారదీక్షను కొనసాగిస్తున్నారు.