గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 30 నవంబరు 2015 (15:45 IST)

హిందూ రాజ్యంపై సలీం వ్యాఖ్యలు .. క్షమాపణకు రాజ్‌నాథ్ పట్టు

భారతదేశంలో 800 సంవత్సరాల హిందూ రాజ్యం వచ్చిందంటూ కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ వ్యాఖ్యానించారని సీపీఎం ఎంపీ మహ్మద్ సలీం చేసిన వ్యాఖ్యలు సోమవారం లోక్‌సభలో పెను దుమారాన్నే రేపాయి. సలీం వ్యాఖ్యలపై భారతీయ జనతా పార్టీ ఎంపీలంతా తీవ్రంగా వ్యతిరేకించారు. 
 
ఈ సందర్భంగా రాజ్‌నాథ్ సింగ్ స్పందిస్తూ... తానెప్పుడూ అలాంటి వ్యాఖ్యలు చేయలేదన్నారు. తాను ఆ వ్యాఖ్యలను ఎక్కడ చేశానో సలీం చెప్పాలని డిమాండ్ చేశారు. సలీం చేసిన వ్యాఖ్యలు తనను తీవ్రంగా కలచి వేశాయని ఆవేదన వ్యక్తం చేశారు. హోం మంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే సమాజం హర్షించదన్నారు. తనపై చేసిన ఆరోపణలను సలీం నిరూపించాలని లేదా క్షమాపణ చెప్పాలని మంత్రి డిమాండ్ చేశారు. 
 
అంతకుముందు.. అసహనంపై స్పీకర్ సుమిత్రా మహాజన్ లోక్‌సభలో సోమవారం చర్చకు అనుమతిచ్చిన విషయం తెల్సిందే. 193వ రూల్ కింద చర్చను ప్రారంభించిన సీపీఎం ఎంపీ మహ్మద్ సలీం చేసిన వ్యాఖ్యలతో ఒక్కసారిగా పాలకపక్షం బీజేపీ మండిపడింది. 800 ఏళ్ల తర్వాత మళ్లీ హిందూరాజ్యం వచ్చిందని కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారంటూ ఆయన చెప్పడంతో సభలో దుమారం రేగింది. 
 
అయితే, తానెప్పుడూ ఆర్ఎస్ఎస్ సమావేశంలో కూర్చోలేదని.. కేవలం పత్రికల్లో వచ్చిన కథనాలను చూసి మాత్రమే చెప్పానని సలీం అన్నారు. పృథ్వీరాజ్ చౌహాన్ తర్వాత మళ్లీ ఇన్నేళ్లకు దేశంలో హిందూపాలన వచ్చిందని ఎన్నికల తర్వాత జరిగిన ఓ సమావేశంలో రాజ్‌నాథ్ అన్నట్లు సలీం తెలిపారు. తాను కేవలం ఒక పత్రిక కథనాన్ని మాత్రమే ప్రస్తావిస్తున్నానని, రాజ్‌నాథ్ దాన్ని ఖండించాలంటే సదరు పత్రికకు లీగల్ నోటీసు పంపాలని సూచించారు. దేశంలో అసహనం ఉందని ఎవరూ అనడం లేదని, ఈ తరహా ఆరోపణలను కావాలనే కొంతమంది పుట్టిస్తున్నారని ఆయన చెప్పారు.