మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By PNR
Last Updated : సోమవారం, 27 ఏప్రియల్ 2015 (16:23 IST)

భూకంప ప్రభావం వల్ల 72 మంది చనిపోయారు : రాజ్‌నాథ్ సింగ్

నేపాల్ దేశంతో పాటు ఉత్తర, ఈశాన్య భారతావనిని వణికించిన భూకంపంపై హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ సోమవారం పార్లమెంటులో ప్రకటన చేశారు. వార్త తెలిసిన ఐదు నిమిషాల్లోనే ప్రధాని మోడీ తనను అప్రమత్తం చేశారన్నారు. తనకంటే ముందే విషయం తెలుసుకున్న ప్రధాని తక్షణమే రంగంలోకి దిగడం సంతోషం కలిగించిందన్నారు. 
 
అలాగే, ఈ భూకంపం తాకిడి వల్ల దేశంలో 72 మంది చనిపోయారని తెలిపారు. సహాయ చర్యల కోసం రాష్ట్రాలను సమన్వయం చేసుకున్నామన్నారు. భూకంపం సమయంలో పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వెంటనే స్పందించారని, వారికి కేంద్ర ప్రభుత్వం తరపున కృతజ్ఞతలు చెబుతున్నామని అన్నారు. 
 
అటు నేపాల్‌లో భూకంపంపై ప్రధాని నరేంద్ర మోడీ అత్యవసర సమావేశం నిర్వహించారని సభకు వివరించారు. ఆ దేశానికి పూర్తి సహాయం అందిస్తామని స్పష్టం చేశారు. ప్రధానే స్వయంగా అక్కడి పరిస్థితిని సమీక్షిస్తున్నారని రాజ్‌నాథ్ తెలిపారు. 
 
మరోవైపు...నేపాల్‌ను నేలమట్టం చేసిన పెను భూకంపంపై ప్రధాని నరేంద్ర మోడీ మరో ప్రకటన చేశారు. దేశం శవాల దిబ్బగా మారినా.. మొక్కవోని ధైర్యంతో నేపాల్ ప్రజలు తమ ఆప్తుల కోసం వెతుకులాట సాగిస్తూనే, క్షతగాత్రులకు చేయూతనందిస్తున్నారని కొనియాడారు.  
 
‘నేపాలీల మొక్కవోని ధైర్యానికి సెల్యూట్’ అంటూ ఆయన కొద్దిసేపటి క్రితం ట్విట్టర్‌లో వ్యాఖ్యానించారు. నేపాల్‌లో పరిస్థితులు సాధారణ స్థాయికి వచ్చేదాకా భారత్ సహాయం అందిస్తుందన్నారు. నేపాల్‌లో భారత్ తరపున సేవలందిస్తున్న ఎన్డీఆర్ఎఫ్, సైనిక బలగాలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.