శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : ఆదివారం, 4 డిశెంబరు 2016 (22:57 IST)

జయలలిత ఆరోగ్య పరిస్థితిపై రాజ్‌నాథ్‌ ఆరా... చెన్నైకు రానున్న ప్రధాని మోడీ!?

తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్య పరిస్థితిపై కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ ఆరా తీశారు. అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జయలలితకు ఆదివారం సాయంత్రం 4.30 గంటల ప్రాంతంలో గుండెపోటు రావడంతో అమెను

తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్య పరిస్థితిపై కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ ఆరా తీశారు. అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జయలలితకు ఆదివారం సాయంత్రం 4.30 గంటల ప్రాంతంలో గుండెపోటు రావడంతో అమెను సాధారణ వార్డు నుంచి అత్యవసర సేవల చికిత్సా వార్డుకు తరలించారు. జయ ఆరోగ్య పరిస్థితిపై తమిళనాడు తాత్కాలిక గవర్నర్‌ విద్యాసాగర్‌రావుకు హోం మంత్రి ఫోన్‌ చేసి వివరాలు అడిగి తెలుసుకున్నట్లు సమాచారం.
 
మరోవైపు జయలలిత ఆరోగ్యం ఆందోళనకరంగా ఉన్నట్టు వార్తలు వస్తుండటంతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సైతం అత్యవసరంగా చెన్నైకు రానున్నారనే వార్తలు వస్తున్నాయి. అలాగే, వివిధ ప్రాంతాల పర్యటనలో ఉన్న వివిధ పార్టీలకు చెందిన ప్రాంతీయ పార్టీ నేతలు రాజధాని చెన్నైకు ఒక్కొక్కరుగా చేరుకుంటున్నారు. 
 
కాగా, జయలలితకు గుండెపోటు వచ్చినట్లు అపోలో ఆసుపత్రి వర్గాలు అధికారికంగా హెల్త్ బులెటిన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో విద్యాసాగర రావు హుటాహుటిన ముంబై నుంచి చెన్నై బయలుదేరారు. అమ్మకు గుండె జబ్బు రావడంతో అన్నాడీఎంకే నేతలు దిగ్భ్రాంతికి గురయ్యారు. జయలలిత అనారోగ్య పరిస్థితి తెలిసి మంత్రులు, కార్యకర్తలు, అభిమానులు ఆసుపత్రి వద్దకు భారీగా చేరుకున్నారు.
 
మరోవైపు.. జయలలితకు చెన్నై అపోలో ఆస్పత్రి వైద్యులతో పాటు.. ఢిల్లీ నుంచి ప్రత్యేకంగా చెన్నైకు వచ్చిన ఎయిమ్స్ వైద్యులు కూడా ఆమెకు చికిత్స అందిస్తున్నారు. ముఖ్యంగా కార్డియాలజిస్టుల పర్యవేక్షణలో ఉన్నారు. హృద్రోగ, శ్వాసకోశ నిపుణులు జయలలిత ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తున్నట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.
 
ఇదిలావుండగా, గత రెండున్నర నెలలుగా జయలలిత ఆసుపత్రిలోనే ఉంటున్నారు. అమ్మకు గుండెపోటు వచ్చిన విషయం తెలిసి పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానుల్లో ఆందోళన కనిపిస్తోంది. అన్ని పోలీస్ స్టేషన్లు అలర్ట్‌గా ఉండాలని ప్రకటించడంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు.