బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By PNR
Last Updated : బుధవారం, 1 అక్టోబరు 2014 (08:02 IST)

జస్ట్ 5 మినిట్స్ టైంమివ్వండి... జయలలిత నిర్ధోషి అని నిరూపిస్తా.. రాంజెఠ్మలానీ!

తనకు కేవలం ఐదంటే ఐదు నిమిషాలు సమయమిస్తే చాలని అన్నాడీఎంకే అధినేత్రి జయలలితకు వ్యతిరేకంగా దాఖలైన అక్రమ ఆస్తుల కేసులో ఎటువంటి ఆధారాలు లేవని నిరూపిస్తానని ప్రముఖ క్రిమినల్ న్యాయవాది రాం జెఠ్మలానీ అన్నారు. ఈ కేసు విచారణ కోసం తాను లండన్‌ నుంచి ప్రత్యేకంగా వచ్చానని చెబుతూ జయ బెయిల్‌ పిటిషన్‌పై వెంటనే విచారణ చేపట్టాలని ఆయన కోర్టును కోరారు. 
 
కర్ణాటక హైకోర్టులోని 8వ నెంబర్‌ హాలులో బుధవారం ఉదయం 11 గంటలకు కోర్టు వెకేషనల్‌ సింగిల్‌ బెంచ్‌ జడ్జి జస్టిస్‌ రత్నకళ జయ బెయిల్‌ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన సందర్భంగా ఆయన పై విధంగా వ్యాఖ్యానించారు. అయితే పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ లేకపోవడాన్ని గమనించిన జస్టిస్‌ రత్నకళ అభ్యంతరం వ్యక్తం చేశారు. 
 
ఈ బెయిల్ పిటీషన్‌ విచారణకు పబ్లిక్ ప్రాసిక్యూటర్ లేనందున విచారణ చేపట్టలేనని జస్టీస్ రత్నకళ వ్యాఖ్యానించగా.. ఆసమయంలో జయలలిత తరఫున ప్రముఖ న్యాయవాది రాం జెఠ్మలానీ ముందుకు వచ్చారు. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో బెయిల్‌ పిటిషన్‌పై విచారణ జరపవచ్చునని వాదించారు. అయితే ఈ వాదనను జస్టిస్‌ రత్నకళ అంగీకరించలేదు. మరోసారి రాం జెఠ్మలాని న్యాయమూర్తికి తన వాదన వినిపించారు. 
 
ఈ కేసు వాదించేందుకు తాను ప్రత్యేకంగా లండన్‌ నుంచి వచ్చానని పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ వ్యవహారంపై పరిశీలన జరిపేందుకు ఐదు నిమిషాల సమయం ఇవ్వాలని జెఠ్మలానీ విజ్ఞప్తి చేశారు. తనకు ఐదు నిమిషాల సమయమిస్తే జయలలితకు వ్యతిరేకంగా దాఖలైన అక్రమ ఆస్తుల కేసులో ఎటువంటి ఆధారాలు లేవని నిరూపిస్తానని జెఠ్మలానీ వాదించారు.