బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By PNR
Last Updated : బుధవారం, 27 మే 2015 (10:30 IST)

ఎయిరిండియా విమానంలో ఎలుకలు.. ఆగిపోయిన ఫ్లైట్!

భారత ప్రభుత్వ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియాలో ఎలుకలు ఇష్టారాజ్యంగా తిరుగుతున్నాయి. దీంతో ఏకంగా విమాన ప్రయాణాన్ని సైతం  నిలిపివేయాల్సి వచ్చింది. తాజాగా ఎయిర్ ఇండియా నడుపుతున్న ఎ-320 విమానంలో ఎలుకలు కనిపించడంతో లెహ్ విమానాశ్రయంలో దాన్ని నిలిపివేశారు. 
 
నిజానికి ఈ విమానాశ్రయం సముద్ర మట్టానికి ఎంతో ఎత్తున ఉంటుంది. ఈ విమానాశ్రయంలో ఎలుకల నివారణకు ఉపయోగపడేలా పొగ పెట్టే యంత్రాలు లేకపోవడంతో ఆ విమానాన్ని అక్కడే ఉంచారు. బుధవారం మరో విమానం ద్వారా వాటిని అక్కడకు పంపనున్నట్టు ఏఐ వర్గాలు తెలిపాయి. 
 
సాధారణంగా ఒక విమానంలో ఎలుక తిరుగుతున్నట్టు కనిపించిందంటే, ఆ విమానాన్ని అత్యవసర ల్యాండింగ్ చేస్తారు. ఆ తర్వాత ఎలుకను చంపేసేందుకు పొగ పెడతారు. ఆ తర్వాత అన్ని రకాల వైర్లు, టెక్నాలజీని నిశితంగా పరీక్షించేదాకా విమానాన్ని టేకాఫ్ చెయ్యనివ్వరు. ఎలుకలు ఒక్క వైరును కొరికినా, విమానంపై పైలట్ నియంత్రణ కోల్పోయి పెను ప్రమాదం జరిగే ప్రమాదం ఉంది. అయితే, లెహ్ విమానాశ్రయం కొండల మధ్య ఉండడంతో, సూర్యడు ఉదయించిన అరగంట తర్వాత మాత్రమే ల్యాండింగునకు అనుమతి ఉంటుంది. 
 
మధ్యాహ్నం తర్వాత గాలుల తీవ్రత కారణంగా విమానాశ్రయాన్ని మూసివేస్తారు. విమానాల్లో ప్రయాణికులు తినుబండారాలను వదిలి వేయడంతోనే ఎలుకలు వస్తుంటాయని, ముఖ్యంగా ఆహారాన్ని లోడ్ చేసే సమయంలో ఇవి విమానాల్లోకి చేరుతుంటాయని, ప్రపంచ వ్యాప్తంగా ఈ సమస్య ఉందని అధికారులు తెలిపారు. ఎక్కడ ఎలుక కనిపించినా, వెంటనే దాన్ని దింపేసి పొగ పెట్టి కనీసం రెండు గంటల పాటు విమానం తలుపులు సీజ్ చేయాల్సి ఉంటుందని వివరించారు.