గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Raju
Last Modified: హైదరాబాద్ , శనివారం, 14 జనవరి 2017 (02:34 IST)

రిజర్వు బ్యాంకుపై కేంద్రం పెత్తనం.. మండిపడుతున్న అధికారులు

కరెన్సీ మేనేజ్‌మెంట్‌పై ఆర్థిక శాఖ ప్రత్యేకంగా ఒక అధికారిని నియమించడంపై ఆర్బీఐ ఉద్యోగులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఏదైమైనా ఆర్బీఐని బైపాస్ చేస్తూ కేంద్రం తీసుకున్న ఈ చర్య కేంద్ర బ్యాంకుకు, ప్రభుత్వానికి మధ్య చిచ్చు రాజేసినట్లయింది.

పెద్దనోట్ల రద్దు విషయంలో ఆర్బీఐని పక్కనపెట్టి ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్న స్వతంత్ర నిర్ణయం దేశప్రజానీకాన్ని అతలాకుతలం చేసిన విషయం తెలిసిందే. 86 శాతంగా ఉన్న పెద్ద నోట్లను ఉన్నఫళాన రద్దు చేసి ప్రజలకు నగదు అందుబాటులో లేకుండా చేసిన వైనంతో మొత్తం బ్యాంకింగ్ వ్యవస్థమీదే విశ్వాసం సడలిన పరిస్థితి ఏర్పడింది. పైగా పెద్దనోట్ల రద్దు నిర్ణయం మీదేనా అంటూ సుప్రీంకోర్టు నిగ్గతీయటంతో ఆర్బీఐ తన చరిత్రలో మొదటిసారిగా న్యాయస్థానం ముందు హాజరు కావలసిన పరిస్థితిని కొని తెచ్చుకుంది.
 
పెద్ద నోట్ల రద్దు నిర్ణయం కేంద్రప్రభుత్వానిదే అని కోర్టుకు చెప్పి బయటపడిన ఆర్బీఐకి ఇంకా కష్టాలు ముగియనట్లుంది. కరెన్సీ వ్యవహారంలో ఆర్బీఐ అధికారాలనే కట్ చేసిన కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు మరింత జలక్ ఇస్తూ నగదు నిర్వహణపై ఆర్బీఐ అధికారాలకే పాతరేసే చర్యకు పాల్పడింది. కరెన్సీ మేనేజ్‌మెంట్‌పై ఆర్థిక శాఖ ప్రత్యేకంగా ఒక అధికారిని నియమించడంపై ఆర్బీఐ ఉద్యోగులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఏదైమైనా ఆర్బీఐని బైపాస్ చేస్తూ కేంద్రం తీసుకున్న ఈ చర్య కేంద్ర బ్యాంకుకు, ప్రభుత్వానికి మధ్య చిచ్చు రాజేసినట్లయింది. 
 
కేంద్రం వరుస చర్యలతో పరువు పోయిన ఐర్బీఐ అధికారులు, ఉద్యోగులు కేంద్రానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున గళం విప్పారు. ద్రవ్య నిర్వహణ అనేది  పూర్తిగా ఆర్బీఐ పరిధిలోదని.. ఇందులో కేంద్రం అనవసరంగా జోక్యం చేసుకుందని పేర్కొంటూ ఆర్బీఐ ఉద్యోగులు గవర్నర్‌ ఉర్జిత్ పటేల్‌కి ఒక లేఖ రాశారు. కేంద్రం అనవసర జోక్యాన్ని తాము అవమానంగా భావిస్తున్నామని ఘాటుగా విమర్శించారు. 
 
అధికారుల బాధకు కూడా అర్థముంది కేంద్రం ఆర్బీఐపై అనవసర పెత్తనం చేయడంతో ఇప్పటిదాకా సంపాదించిన ఆర్బీఐ పరువు ఇప్పుడు మంటగలిసిందని అధికారుల అభిప్రాయం.. కరెన్సీ మేనేజ్‌మెంట్‌ ఆర్బీఐ పరిధిలోని అంశమని.. దీనిపై కేంద్రం జోక్యం చేసుకోవడం ఏంటని ప్రశ్నించారు. ఆ చర్యతో కేంద్రం ఆర్బీఐ కార్యనిర్వాహక అధికారాలను ఆక్రమించిందని పేర్కొన్నారు. 
 
అందుకే తమ బాధను, ఆగ్రహాన్ని ప్రదర్శిస్తూ ఆర్బీఐ సిబ్బంది నేరుగా రిజర్వు బ్యాంకు గవర్నర్‌కు ఉత్తరం పంపారు. ‘‘ ఆర్బీఐ స్వయం ప్రతిపత్తిని, ప్రతిష్ఠను కాపాడాల్సింది.. ఈ బ్యాంకు అత్యున్నత అధికారి అయిన గవర్నరే. అందువల్ల మీకు లేఖ రాస్తున్నాం. ఆర్థిక శాఖ అనవసర జోక్యాన్ని సత్వరం నియంత్రించండి. ఇందుకోసం వెంటనే చర్యలు తీసుకోండి. కేంద్ర ప్రభుత్వ చర్యలతో ఉద్యోగులు అవమానకరంగా భావిస్తున్నారు..’’ అని సదరు లేఖలో పేర్కొంది. 
 
935 నుంచి ఆర్బీఐ కరెన్సీ నిర్వహణ బాధ్యతలను నిర్వహిస్తోందని, ఇందులో ఆర్బీఐకి ఇతరుల సాయం ఏమీ అవసరం లేదని.. ఆర్థిక శాఖ జోక్యం శోచనీయమైందని.. ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని ఉద్యోగులు వెల్లడించారు. ఆర్బీఐ పనితీరుపై ముగ్గురు మాజీ గవర్నర్లు మన్మోహన్‌సింగ్‌, వైవీ రెడ్డి, బిమల్‌ జలాన్‌ ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యంలో ఉద్యోగుల లేఖ ప్రాధాన్యం సంతరించుకుంది.