గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By PNR
Last Updated : మంగళవారం, 25 నవంబరు 2014 (10:39 IST)

ఐపీఎస్ అధికారి అశోక్ ఖేమ్కాకు మళ్లీ కీలక బాధ్యతలు!

కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రా అవినీతి వ్యవహారాన్ని వెలుగులోకి తెచ్చిన ఐపీఎస్ అధికారి అశోక్ ఖేమ్కాకు హర్యానా రాష్ట్ర ప్రభుత్వం మళ్లీ కీలక బాధ్యతలు అప్పగించింది. ఆయనను రాష్ట్ర రవాణా శాఖ కార్యదర్శిగా నియమించింది. 
 
రాబర్ట్ వాద్రా భూకేటాయింపులను రద్దు చేసిన ఆయనను మాజీ ముఖ్యమంత్రి భూపిందర్ సింగ్ హుడా సర్కారు అప్రధాన్య పోస్టుకు బదిలీ చేయడంతో పాటు నానా ఇబ్బందులకు గురి చేసిన విషయం తెల్సిందే. అయితే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించడం, నిన్నటి హర్యానా ఎన్నికల్లోనూ బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంతో ఖేమ్కాకు కీలక శాఖ పగ్గాలు దక్కే అవకశాలున్నాయన్న వార్తలు వినవచ్చాయి. 
 
అందరి అంచనాలను నిజం చేస్తూ ఖేమ్కాను రాష్ట్ర రవాణా శాఖ కార్యదర్శిగా నియమిస్తూ మనోహర్ లాల్ ఖట్టర్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. హుడా సర్కారు ఆగ్రహానికి గురైన మరో సీనియర్ అధికారి ప్రదీప్ కన్షీని కూడా ఖట్టర్ ప్రభుత్వం కీలకమైన గుర్గావ్ డిప్యూటీ కమిషనర్ పదవిలో నియమించింది.