శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By PNR

దేశాభివృద్ధిని ప్రోత్సహించే రాజకీయాలు కావాలి : మంత్రి వెంకయ్య

దేశాభివృద్ధిని ప్రోత్సహించేలా రాజకీయాలు ఉండాలని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు అన్నారు. ఢిల్లీలో జరిగిన ఓ అంతర్జాతీయ సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడుతూ... దేశంలో అభివృద్ధి శక్తుల్ని పురికొల్పే క్రమంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకు ఆచరణాత్మకమైన పరిష్కారాలను సూచించాలని విశ్వవిద్యాలయాలు, మేధావులకు విజ్ఞప్తి చేశారు. 
 
దేశంలో ప్రజా జీవనానికి సంబంధించిన ప్రతి రంగంలో మార్పు తీసుకురావాలని ప్రధాని నరేంద్ర మోడీ భావిస్తున్నారన్నారు. ముఖ్యంగా రాజకీయాలు దేశాభివృద్ధిని ప్రోత్సహించేలా ఉండాలని, అభివృద్ధికి ఆటంకం కారాదని అభిప్రాయపడ్డారు. పర్యావరణ అంశాలను దృష్టిలో పెట్టుకుని భూమి, నీరు, విద్యుత్‌ తదితర అంశాలపై రాబోయే 20 ఏళ్లకు అవసరమైన మాస్టర్‌ ప్లాన్లను ప్రతి నగరం తయారు చేసుకోవాలని సూచించారు. 
 
దేశంలో 100 స్మార్ట్‌ సిటీల అభివృద్ధితో పాటు.. వాన నీటి సంరక్షణ, నీటి శుద్ధి, గ్రీన్‌ బిల్డింగ్స్‌, సోలార్‌ విద్యుత్‌, ఎల్‌ఈడీ లైట్లు, ప్రతి ఇంటికీ టాయ్‌లెట్లు, అన్ని భవనాలకూ పార్కింగ్‌ సదుపాయం, పారదర్శకత, జవాబుదారీతనం వంటి పది అంశాల కార్యాచరణ ప్రణాళికతో పట్టణాల్లో సుస్థిరమైన అభివృద్ధి సాధించనున్నామని తెలిపారు.