శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : గురువారం, 26 నవంబరు 2015 (17:21 IST)

ఆర్ఎస్ఎస్‌కు నేను సారీ చెప్పడమా.. నో.. నెవర్.. కేసునెదుర్కొంటా : రాహుల్

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్)కు సారీ చెపితే కేసు నుంచి విముక్తులవుతావంటూ సుప్రీంకోర్టు చేసిన సూచనను కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ సున్నితంగా తిరస్కరించారు. ఆర్ఎస్ఎస్‌కు ఎట్టిపరిస్థితుల్లోనూ క్షమాపణ చెప్పే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. పైగా... ఈ కేసును కోర్టులో ఎదుర్కొంటానని తేల్చి చెప్పడంతో సుప్రీంకోర్టు కేసు విచారణను వచ్చే ఫిబ్రవరికి వాయిదా వేసింది. 
 
గత ఎన్నికల ప్రచారంలో రాహుల్ ఓ బహిరంగ సభలో ప్రసంగిస్తూ.. మహాత్మా గాంధీ హత్యకు రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘే కారణమంటూ ఆరోపించారు. దీనిపై ఆర్‌ఎస్‌ఎస్‌కు చెందిన ఓ కార్యకర్త రాహుల్‌పై కోర్టులో పరువునష్టం పిటిషన్ దాఖలు చేశాడు. కొన్నాళ్లూ స్టేలో ఉన్న ఈ కేసు గురువారం విచారణకు వచ్చింది. రాహుల్ తరపున కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ప్రముఖ న్యాయవాది కపిల్ సిబల్ వాదిస్తున్నారు. 
 
ఈ కేసు విచారణ సమయంలో సుప్రీంకోర్టు ఓ సూచన చేసింది. ఆర్ఎస్ఎస్‌కు క్షమాపణలు చెబితే కేసు విచారణతో పని ఉండదని చెప్పింది. అయితే, ఈ సలహాను ఆయన తిరస్కరించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆర్ఎస్ఎస్‌కు క్షమాపణలు చెప్పే ప్రసక్తే లేదన్నారు. ఆ కేసులో వాదనకు తాను సిద్దమేనంటూ రాహుల్ ఒప్పుకున్నారు. దీంతో కోర్టు స్టేను మళ్లీ పొడిగించింది.