గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By PNR
Last Updated : శుక్రవారం, 29 ఆగస్టు 2014 (15:06 IST)

మైత్రేయ ఫిర్యాదు : సదానంద సన్ కార్తీక్‌పై 420 కేసు!

కన్నడ వర్ధమాన నటి మైత్రేయ ఇచ్చిన ఫిర్యాదుతో కేంద్ర రైల్వే మంత్రి సదానంద గౌడ కుమారుడు కార్తీక్ గౌడపై బెంగుళూరు ఆర్.టి. నగర్ పోలీసులు 420 కేసును నమోదు చేశారు. తనను పెళ్ళి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడంటూ బెంగుళూరు పోలీసులకు నటి లిఖిత పూర్వక ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. 
 
అయితే కార్తీక్ గౌడ కేంద్ర మంత్రి కొడుకు కావడంతో కేసు బుక్ చేయాలా వద్దా అని తర్జన భర్జనలు పడిన పోలీసులు చివరికి కార్తీక్ గౌడ మీద కేసు నమోదు చేశారు. మైత్రేయ నుంచి మరింత సమాచారాన్ని రాబట్టిన తర్వాతే కార్తీక్ గౌడను అదుపులోకి తీసుకోవాలా వద్దా అనే విషయాన్ని పరిశీలిస్తామని పోలీసులు చెబుతున్నారు. ఇంతముందు వార్తలు వెలువడినట్టుగా మైత్రేయ కార్తీక గౌడ తనను మానభంగం చేసినట్టుగా ఆమె ఫిర్యాదు చేయలేదని, తనను పెళ్ళి చేసుకుంటానని చెప్పి మోసం చేశాడని మాత్రమే ఫిర్యాదు చేసిందని పోలీసులు వెల్లడించారు. 
 
ఇదిలావుండగా, బుధవారం నుంచి గురువారం సాయంత్రం వరకు బోసిమెడతో కనిపించిన మైత్రేయ గురువారం సాయంత్రం మాత్రం హఠాత్తుగా పసుపు కొమ్మును కట్టుకొని కనిపించింది. కార్తీక్ గౌడ్‌పైన ఆర్టీ నగర్ పోలీసు స్టేషన్‌లో మైత్రియ ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. బుధవారం రాత్రి లిఖిత పూర్వక ఫిర్యాదు మేరకు పోలీసులు వెంటనే ఆమెను అంబేడ్కర్ వైద్య కళాశాలకు తరలించి పరీక్షలను చేయించారు. ఫిర్యాదు నేపథ్యంలో మరింత సమాచారం సేకరించాలని, దీనికోసం గురువారం మధ్యాహ్నం పోలీసు స్టేషన్‌కు రావాలని సంబంధింత అధికారులు ఆమెకు సూచించారు. 
 
ఆమె నుండి ఆధారసహిత సమాచారాన్ని రాబట్టాకే కార్తీక్ గౌడ్‌ను అదుపులోకి తీసుకుంటామని అధికారులు చెప్పారు. కార్తీక్ అత్యాచారానికి పాల్పడినట్లు ఫిర్యాదులో పేర్కొనలేదన్నారు. వైద్య పరీక్షల నివేదిక వచ్చాక కేసు దర్యాఫ్తును వేగవంతం చేస్తామన్నారు. తాను సదానంద గౌడ కుటుంబం కోడలిగా వెళ్లాలని ఆశిస్తున్నానని మైత్రేయ బెంగళూరులో తెలిపారు.