శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By PNR
Last Updated : శుక్రవారం, 31 అక్టోబరు 2014 (11:59 IST)

సర్దార్ వల్లాభాయ్ పటేల్ లక్ష్యం.. ఐక్య భారత్ : నరేంద్ర మోడీ

సర్దార్ వల్లాభాయ్ పటేల్ భారత దేశాన్ని ఐక్యంగా ఉంచేందుకు కృషి చేశారని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గుర్తు చేశారు. అంతేకాకుండా, పటేల్ కేవలం ఉక్కు సంకల్పం ఉన్న నేత మాత్రమే కాదని, భారతదేశ స్ఫూర్తి ప్రదాత అని మోడీ కొనియాడారు. శుక్రవారం ఉదయం పటేల్‌ జయంతి సందర్భంగా విజయ్‌చౌక్‌ వద్ద ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. 
 
ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ పటేల్‌ ఆధునిక భారత నిర్మాత అని అభివర్ణించారు. పటేల్‌ ప్రధాని అయి ఉంటే దేశం పరిస్థితి మరోలా ఉండేదన్నారు. దేశాన్ని ఏకీకృతం చేయడానికే పటేల్‌ తన జీవితాన్ని అంకింతం చేశారని చెప్పారు. స్వాతంత్య్ర ఉద్యమంలో రైతులందరినీ ఏకతాటిపై తెచ్చిన ఘనత పటేల్‌ది అని గుర్తు చేశారు. 
 
సైద్ధాంతిక విభేదాలను బట్టి దేశచరిత్రను మార్చలేమని మోడీ అన్నారు. చరిత్రను మరిచే ఏ జాతికి భవిష్యత్‌ ఉండదని వ్యాఖ్యానించారు. పటేల్‌ లేకుండా గాంధీ ఏం చేయలేకపోయేవారని చెప్పారు. సంస్థానాల విలీనం పటేల్‌ శక్తిసామర్థ్యాలకు ప్రతీకగా కొనియాడారు. పటేల్‌ లక్ష్యం... ఐక్య భారత్‌ అని, దాని కోసమే తమ ప్రభుత్వం పాటుపడుతున్నట్టు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చెప్పారు.