గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : శనివారం, 11 ఫిబ్రవరి 2017 (16:11 IST)

శశికళ వర్గంలో ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు.. రాజ్‌భవన్ వర్గాల ఆరా?

తమిళనాడు రాష్ట్రంలోని అధికార అన్నాడీఎంకేలో నెలకొన్న రాజకీయాలపై సర్వత్రా ఉత్కంఠత నెలకొంది. ముఖ్యమంత్రి కుర్చీ కోసం ఇటు పన్నీర్ సెల్వం, అటు శశికళలు పట్టుబట్టారు. ఈ రాజకీయం ఇపుడు రాజ్‌భవన్‌కు చేరింది.

తమిళనాడు రాష్ట్రంలోని అధికార అన్నాడీఎంకేలో నెలకొన్న రాజకీయాలపై సర్వత్రా ఉత్కంఠత నెలకొంది. ముఖ్యమంత్రి కుర్చీ కోసం ఇటు పన్నీర్ సెల్వం, అటు శశికళలు పట్టుబట్టారు. ఈ రాజకీయం ఇపుడు రాజ్‌భవన్‌కు చేరింది. ముఖ్యమంత్రి పదవిలో కొనసాగాలని పన్నీర్‌ సెల్వం, ఆ స్థానాన్ని ఆశిస్తున్న శశికళలు గురువారం వేర్వేరుగా గవర్నర్‌ విద్యాసాగర్‌రావును కలిసిన విషయం తెలిసిందే. వారు పేర్కొన్న అంశాలను రాజ్‌భవన్‌ వర్గాలు నిశితంగా పరిశీలిస్తున్నాయి. 
 
ముఖ్యంగా గవర్నర్‌ సీహెచ్.విద్యాసాగర్ రావుకు శశికళ సమర్పించిన లేఖలో 131 మంది శాసనసభ్యుల మద్దతు ఉందని పేర్కొన్నారు. ఆ లేఖలో ఎమ్మెల్యేల సంతకాలతో కూడిన పత్రాన్ని అందించారు. శుక్రవారం రాజ్‌భవన్‌ వర్గాలు ఈ అంశంపై ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు తెలిసింది. శశికళ ఆదివారం పార్టీ శాసనసభ పక్షనేతగా ఎన్నికైనప్పటి నుంచి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. మారిన పరిణామాల దృష్ట్యా పన్నీర్‌ సెల్వానికి మద్దతిచ్చే శాసనసభ్యుల సంఖ్య పెరిగింది. ఈ పరిస్థితుల్లో శశికళకు మద్దతిస్తున్న శాసనసభ్యుల సంఖ్య తగ్గాల్సి ఉంది. 
 
కానీ గురువారం రాత్రి ఆమె గవర్నర్‌కు సమర్పించిన లేఖలోనూ 131 మంది పేర్లను ప్రస్తావించారని సమాచారం. దీంతో ఈ సంఖ్యపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే, ఆమె వెంట 90 మంది మాత్రమే ఉన్నారని పన్నీరుసెల్వం వర్గం చెపుతోంది. శశికళకు మద్దతుగా సంతకాలు చేసిన శాసనసభ్యులు సైతం ఇష్టపూర్వకంగా చేయలేదని, బెదిరింపులకు తలొగ్గాల్సి వచ్చిందని పన్నీర్ సెల్వం గవర్నర్ దృష్టికి తెచ్చినట్లు సమాచారం. ఈ దిశగా కూడా రాజ్‌భవన్‌ అధికారులు పరిశీలిస్తున్నట్లు సమాచారం.